సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, మెడికల్ పీజీ సీట్ల భర్తీ విషయంలో నీట్ (జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష) నేషనల్ పూల్‌లో చేరతామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆమోదం తెలిపాయి. ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ల కోసం నీట్‌ను నిర్వహించే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ), వైద్య విద్య పీజీ సీట్ల భర్తీ ప్రక్రియను నిర్వహించే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) ఈ మేరకు ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. నేషనల్ పూల్‌లో రాష్ట్రం చేరికకు సంబంధించిన అధికారిక సమాచారం రాగానే రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయనుంది.
మొత్తంగా వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని వైద్య విద్య సీట్ల భర్తీ ప్రక్రియ నేషనల్ పూల్ విధానంలోనే జరగనుంది. దీంతో ఎంబీబీఎస్, మెడికల్ పీజీ సీట్లు ఆశించే రాష్ట్ర విద్యార్థులకు అవకాశాలు మరింత పెరగనున్నాయి. గత రెండేళ్లుగా నీట్ ఆధారంగానే ఎంబీబీఎస్ సీట్ల భర్తీ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న విధానం కంటే నేషనల్ పూల్‌లో చేరితేనే రాష్ట్ర విద్యార్థులకు ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉండటంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ 2018–19 విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ కోసం నిర్వహించే నీట్ పరీక్ష నోటిఫికేషన్ వెలువడేలోపే ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ వైద్య సీట్లపై నేషనల్ పూల్‌లో చేరాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో వైద్య విద్యను నిర్వహించే కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ మేరకు సీబీఎస్‌ఈ, ఎన్‌బీఈలకు ప్రతిపాదనలు పంపింది.
రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనం...
నీట్ నేషనల్ పూల్‌లో తెలంగాణ చేరితే రాష్ట్రంలోని ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం, పీజీ మెడికల్ సీట్లలో 50 శాతం నేషనల్ పూల్‌లోకి వెళతాయి. అలాగే అన్ని రాష్ట్రాల్లోని సీట్లలో ఇంతే శాతం చొప్పున సీట్లలో రాష్ట్ర విద్యార్థులకు అవకాశాలు ఉంటాయి. తెలంగాణలోని మొత్తం 22 వైద్య కాలేజీల్లో కలిపి 3,200 ఎంబీబీఎస్, 12 దంత వైద్య కాలేజీల్లో 1,140 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో విద్యాసంస్థలకు పదేళ్లపాటు ఉమ్మడి కౌన్సెలింగ్ అనే నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో కోటా చొప్పున సీట్లు భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో 85 స్థానికులకు దక్కుతున్నాయి.
మరో 15 శాతం సీట్లలో మెరిట్ కోటా కింద ఆంధ్రప్రదేశ్ వారికీ అవకాశం వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 15 శాతం సీట్లలో మెరిట్ ప్రాతిపదికన తెలంగాణ విద్యార్థులకూ అవకాశం ఉంటోంది. రాష్ట్రం నేషనల్ పూల్‌లోకి మారిన నేపథ్యంలో మెరిట్ కోటా సీట్ల అడ్మిషన్ల ప్రక్రియ మారనుంది. మెరిట్ కోటాలోని 15 శాతం సీట్లకు దేశవ్యాప్తంగా (జమ్మూకశ్మీర్ మినహా) అన్ని రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం దక్కుతుంది. అలాగే దేశవ్యాప్తంగా (జమ్మూకశ్మీర్ మినహా) అన్ని రాష్ట్రాల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో మన రాష్ట్ర విద్యార్థులకు సీట్లు దక్కుతాయి. మరోవైపు రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో కలిపి 1,140 మెడికల్ పీజీ సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం స్థానికులకు 85 శాతం, మెరిట్ కోటా (స్థానికేతరులు) కింద 15 శాతం సీట్లు కేటాయిస్తున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల తరహాలోనే పీజీ సీట్లలోనూ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు, ఆ రాష్ట్రంలో మన విద్యార్థులకు సీట్లు ఇస్తున్నారు. నేషనల్ పూల్‌లో చేరడం వల్ల వైద్య విద్య పీజీ సీట్లలో మెరిట్ కోటా 50 శాతానికి పెరగనుంది. ఇతర రాష్ట్రాల్లోని పీజీ సీట్లలోనూ రాష్ట్ర విద్యార్థులకు ఇంతే శాతం అవకాశాలు ఉంటాయి.
దేశంలో మెడికల్ సీట్ల వివరాలు...
మొత్తం కాలేజీలు : 436
మొత్తం ఎంబీబీఎస్ సీట్లు : 52,105
ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లు : 27,710
ప్రస్తుతం నేషనల్ పూల్‌లో సీట్లు : 4,157
మొత్తం పీజీ సీట్లు : 22,038
ప్రభుత్వ కాలేజీల్లో పీజీ సీట్లు : 14,202
Comments
Please login to add a commentAdd a comment