వీడిన బేల్దార్ హత్యకేసు మిస్టరీ
వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య
హత్యాస్థలిలో వదిలేసిన పిడిబాకు కోసం వచ్చి దొరికిన నిందితుడు
తనకల్లు : చీకటిమానిపల్లి వద్ద జరిగిన బేల్దార్ ఆంజనేయులు (30) హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తేలింది. నిందితుడు హత్యాస్థలిలో వదిలేసిన పిడిబాకును తీసుకునేందుకు వచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలను కదిరి రూరల్ సీఐ శ్రీధర్ శనివారం మీడియాకు వెల్లడించారు. చిత్తూరు జిల్లా మొలకలచెరువు మండలం చెన్నమగారిపల్లికి చెందిన ఆంజినేయులు అలియాస్ అంజి (30) తన సోదరి మంజులను తనకల్లు మండలం చీకటిమానుపల్లికి చెందిన సోమశేఖర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆంజనేయులు తన సోదరిని చూడడానికి తరచూ గ్రామానికి వచ్చేవాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన రామలక్ష్మణ్ కుటుంబంతో పరిచయం అయ్యింది. రామలక్ష్మణ్‌ను మామా అని, అతని భార్య అంజలిని అక్క అంటూ చనువుతో మెలిగేవాడు.
ఈ చనువు రానురాను అంజలితో వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు గ్రామస్తులు రామ్‌లక్ష్మణ్ దృష్టికి తీసుకెళ్లగా భార్యపై ఉన్న నమ్మకంతో పెద్దగా పట్టించుకోలేదు. ఓరోజు ఆంజనేయులు దగ్గర రామ్‌లక్ష్మణ్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా తనకు ఇది వరకే పెళ్లి అయిన మహిళతో సంబంధం ఉందని, తననే వివాహం చేసుకుంటానని చెప్పాడు. అడ్డు వస్తే ఆమె భర్తను హతమార్చి అయినా పెళ్లి చేసుకుంటానని అనడంతో రామ్‌లక్ష్మణ్‌కు అనుమానం వచ్చింది. ఈ నెల 18న తెల్లవారుజామున బహిర్భుమికి వెళ్లివస్తానని భర్తతో చెప్పి అంజలి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. అనుమానంతో ఉన్న భర్త ఆమెకు తెలియకుండా అనుసరించాడు. అప్పటికే అంగన్‌వాడీ కేంద్రం దగ్గర ఆంజనేయులు వేచి ఉన్నాడు. ఆమె రాగానే ఇద్దరు సన్నిహితంగా మెలగడం కళ్లారా చూసిన రామలక్ష్మణ్ అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు. భార్య ఇంటికి రాగానే నిలదీయగా ఆమె తప్పు చేశానని, ఇంకెప్పుడూ అలాంటి పని చేయనని భర్త కాళ్లు పట్టుకుంది. దీంతో ఆమెను క్షమించి బుద్ధిగా ఉండాలని హెచ్చరించాడు.
పద్ధతి మార్చుకోమంటే నిర్లక్ష్య సమాధానం
ఆంజనేయులు కుటుంబ సభ్యులను రామ్‌లక్ష్మణ్ కలిసి అతన్ని తమ గ్రామానికి రాకుండా చూడాలని కోరాడు. ఈ నెల 19న రామ్‌లక్ష్మణ్ స్నేహితుడైన మాధవతో కలిసి మద్యం తాగడానికి గ్రామంలోని పాత శివాలయం వద్దకు వెళ్లారు. అక్కడికి ఆంజనేయులు కూడా వచ్చాడు. ముగ్గురూ కలిసి పూటుగా మద్యం తాగారు. అక్కడి నుండి ఆంజినేయులు ద్విచక్ర వాహనంలో శశ్మానం వైపు బయల్దేరారు. అక్కడ మాధవ్ బహిర్భుమికి వెళ్లాడు. పక్కన ఎవ్వరూ లేకపోవడంతో తన భార్యతో వివాహేతర సంబంధం మానుకోవాలని ఆంజనేయులును కోరగా.. అతను చాలా నిర్లక్ష్యంగా మాట్లాడడంతో ఓర్చుకోలేకపోయిన రామలక్ష్మణ్ తన వెంట తెచ్చుకున్న పిడిబాకుతో మెడ భాగంలో బలంగా పొడిచాడు. కింద పడిపోయిన ఆంజనేయులుపై మరో ఐదు చోట్ల విచక్షణారహితంగా పొడవడంతో అతను అక్కడిక్కడే చనిపోయాడు. పిడిబాకును దగ్గర్లోని చెట్ల పొదల్లో పారేసి రామ్‌లక్ష్మణ్ పరారయ్యాడు.
పిడిబాకు కోసం వచ్చి పట్టుబడ్డ నిందితుడు
పిడిబాకును హత్యాస్థలి వద్ద పడేయడం వల్ల దానిపై తన వేలిముద్రలు ఉంటాయని, వాటి ద్వారా తనను పోలీసులు పట్టుకుంటారని భయపడిన రామ్‌లక్ష్మణ్ పిడిబాకు కోసం శుక్రవారం శివాలయం వద్దకు వచ్చాడు. అప్పటికే అక్కడ కాపు కాచి ఉన్న పోలీసులు అతడిని పట్టుకొని అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ శ్రీనివాసులు, ఏఎస్‌ఐ బాలరాజు, కానిస్టేబుళ్లు రాము, సురేష్, అంజినాయక్ తదితరులు పాల్గొన్నారు.