గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలి
కలెక్టరేట్ ఎదుట ధర్నాలో మధ్యాహ్న పథక కార్మికులు డిమాండ్
కాకినాడ సిటీ : మధ్యాహ్న భోజనపథకానికి కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని పథకం కార్మికులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట వారు బుధవారం ధర్నా చేశారు. జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన పథక కార్మికులు సుమారు రెండుగంటలపాటు కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ నుంచి డీఈవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు. వర్కర్లు, హెల్పర్లకు కనీసవేతనం రూ.5వేలు ఇవ్వాలని, గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనం పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. వంట చేసే కార్మికులకు బిల్లులు సకాలంలో అందక సరుకుల కోసం అప్పు తెచ్చి వండేపరిస్థితి ఉందన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎం.వీరలక్ష్మి, యూటీఎఫ్ నాయకులు సత్తిరాజు, కార్మికులు పాల్గొన్నారు.