యుద్ధ ప్రాతిపదికన పత్తి కొనండి
సాక్షి, హైదరాబాద్: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలను తక్షణమే అన్ని చోట్లా ప్రారంభించి, యుద్ధ ప్రాతి పదికన పత్తిని కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి ఆయన సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లపై కరీంనగర్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్, పౌర సరఫరాలు, సీసీఐ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. మొత్తం 84 కేంద్రాలకు గాను సీసీఐ ఇప్పటి వరకు 62 కేంద్రాలు ఏర్పాటు చేసి 24 చోట్ల మాత్రమే పత్తి కొనుగోలు చేస్తోందన్నారు. వెంటనే అన్ని కేంద్రాల్లో సిబ్బందిని నియమించడతో పాటు, ఉదయం ఆరు గంటల నుంచే సీసీఐ సిబ్బంది కొనుగోలు ప్రారంభించాలన్నారు.
వారంలో ఐదు రోజుల పాటు సీసీఐ, రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలన్నారు. సీసీఐ విజ్ఞప్తి మేరకు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు, కొనుగోలు కేంద్రాల వద్ద తూకం యంత్రాలను ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అయితే పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ నుంచి తగినంత సహకారం అందడం లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై సీసీఐ సీఎండీ బీకే మిశ్రాతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. కాగా, మిల్లర్ల నుంచి ధాన్యం కొనుగోలు, మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలుపై మంత్రులు హరీశ్, ఈటల సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్‌శాఖ డెరైక్టర్ శరత్, అదనపు డెరైక్టర్ లక్ష్మీబాయి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.