పంచాయతీరాజ్ ఉద్యోగి నిర్వాకం..
మంత్రి పరిటాల సునీత పీఏ పేరుతో విధులకు డుమ్మా
పీఏగా అనర్హుడైనా చక్రం తిప్పుతున్న వైనం
చర్యలకు వెనకడుగేస్తున్న ఉన్నతాధికారులు
అనంతపురం సిటీ: ఉద్యోగ సంఘం నేత.. ఆపై అధికార పార్టీ అండదండలు.. మంత్రి అనుచరుడిగా గుర్తింపు.. ఇంకేముంది తాను ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. అర్హత లేకపోయినా మంత్రి పీఏగా చెలామణి అవుతున్నాడు. సొంత విధులకు ఎగనామం పెడుతున్నాడు. ఎంచక్కా జీతమూ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా తన సొంత శాఖలో ఉన్నతాధికారులను సైతం శాసించేస్థాయికి ఎదిగాడు. ఆయనెవరో కాదు పంచాయతీరాజ్ శాఖ ధర్మవరం సబ్‌డివిజనల్ కార్యాలయం సూపరింటెండెంట్ గంధం శ్రీనివాసులు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన విధులకు వెళ్లలేదు. మంత్రి పరిటాల సునీతకు పీఏగా అనధికారికంగా కొనసాగుతూ ఆమె వెంటే ఉంటున్నాడు.
వాస్తవానికి ప్రభుత్వం నుంచి ఈయన్ని పీఏగా నియమించినట్లు ఉత్తర్వులు లేవు. రికార్డుల్లో ఈ విషయాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా స్పష్టం చేయలేదు. మూడేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు డుమ్మా కొడుతున్న ఈయన వ్యవహరం ప్రస్తుతం ఆ శాఖలోని ఉన్నతాధికారులకు కూడా తలనొప్పిగా మారింది. తనకు కావాల్సిన వారిని కోరిన చోటుకు బదిలీ చేయించుకోవడం, సమాచారం ఏదైనా కావాలంటే మంత్రి పేరు చెప్పి అధికారులను బెదిరించడం పరిపాటిగా మారింది. చమన్ హయాంలో జరిగిన బదిలీల విషయంలో కూడా నలుగురు ఉద్యోగులకు నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్ ఇప్పించినట్లు తెలిసింది. మంత్రి అండదండలు ఉండటంతో సూపరింటెండెంట్‌ను ఉన్నతాధికారులెవరూ ప్రశ్నించే సాహసం కూడా చేయడం లేదు.
పీఏగా ఉండాలంటే..
ప్రజాప్రతినిధికి ప్రభుత్వం నుంచి పీఏని ఏర్పాటు చేయాల్సి వస్తే సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉద్యోగిని ఎంపిక చేస్తారు. సూపరింటెండెంట్ స్థాయి అధికారి ఇందుకు అనర్హులు. అయినా అధికారుల అత్యుత్సాహం, లెక్కలేనితనంతో గంధం శ్రీనివాసులు మూడేళ్లుగా అనధికారిక పీఏగా కొనసాగుతున్నాడు.
అన్నీ తెలిసినా చర్యలు లేవ్
ఆర్‌డబ్ల్యూఎస్‌లో ముగ్గురు సిబ్బంది సమావేశానికి హాజరుకాలేదని, రెవెన్యూలో ఒకరిని, ఎంపీడీఓల్లో ఒకరిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఓ చిరుద్యోగి రూ.1500 లంచం తీసుకున్నాడని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరి మూడేళ్లుగా పంచాయతీరాజ్ శాఖలో సూపరిండెంటెంట్ స్థాయి అధికారి పని చేయకుండా అప్పనంగా వేతనం తీసుకుంటుంటే ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.
మంత్రి సునీత కూడా స్పందించని తీరు:
తనకు దూరపు చుట్టమంటూ చెప్పుకుని తిరుగుతున్న అనధికారిక పీఏ గంధం శ్రీనివాసులు వ్యవహార శైలిపై ఎన్ని అభియోగాలున్నా మంత్రి పరిటాల సునీత పట్టించుకోలేదని సమాచారం. పైగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాకున్నా ఓ అధికారి నిత్యం వారి వెంటే తిరుగుతున్నా కనీసం ఆరా కూడా తీయలేదంటే మంత్రికి బంధుప్రీతి ఏమేరకు ఉందో ఇట్టే అర్థమవుతుంది.
విధులకు ఎగనామం
Published Tue, Sep 12 2017 11:25 PM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM
Advertisement
Advertisement