మిర్చి మార్కెట్‌పై త్రీటౌన్ ప్రజల అభీష్టం మేరకే నిర్ణయం
ఖమ్మం: మిర్చి మార్కెట్ తరలింపు నిర్ణయం ఏళ్ల నాటిదేనని, దీనికి అందరూ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని త్రీటౌన్ అభివృద్ధి సమితి సభ్యులు ప్రస్తావించారు. ఈ మేరకు ఖమ్మం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో త్రీటౌన్ అభివృద్ధి సమితి సభ్యులు, కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, డివిజన్‌ల బాధ్యులు, సీనియర్ నాయకులు ఈ అంశంపై సోమవారం సుదీర్ఘంగా చర్చించారు. మిర్చి మార్కెట్ తరలింపుపై ప్రజలు పదేళ్లుగా ముక్తకంఠంతో వాదిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తక్షణమే త్రీటౌన్ ప్రాంతం నుంచి తరలించి.. తమ ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నట్లు వారు వివరించారు.
ఇప్పటికే అనేక రకాల శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. త్రీటౌన్‌లో ప్రస్తుతం ఉన్న మిర్చి మార్కెట్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, యుద్ధ ప్రాతిపదికన దీనిని ఇక్కడి నుంచి తరలించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే త్రీటౌన్ ప్రాంతం నుంచి ఎక్కడికి తరలించాలి.. తరలించిన మార్కెట్ స్థానంలో మళ్లీ ఎలాంటి అభివృద్ధి సంస్థను తీసుకురావాలని చర్చించారు.
మిర్చి మార్కెట్‌ను త్రీటౌన్ నుంచి రఘునాథపాలెంకు తరలిస్తే అన్ని విధాల, అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుం దని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు రఘునాథపాలెంలో స్థలం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా కేంద్రానికి అతి చేరువలో ఉండాలని, దీంతో రవాణాకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ఉండటం వల్ల అన్ని రకాల సదుపాయాలు, అధికారులు, వ్యాపార లావాదేవీలకు స్పష్టత ఉంటుందన్నారు.
దీనికి తగిన ప్రభుత్వ స్థలం రఘునాథపాలెంలో ఉండటం వల్ల అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి మార్కెట్‌ను తొలగించడం వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం జరగదని, నష్టం జరిగేదల్లా కేవలం మిల్లర్స్, కోల్డ్ స్టోరేజీల నిర్వాహకులకేనని గీత వెంకన్న అన్నారు. మార్కెట్‌ను తరలించాలని అన్ని వర్గాల వారు సుముఖత వ్యక్తం చేసినప్పుడు.. మార్కెట్‌లో ఎలాంటి సంబంధం లేని వారు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కమీషన్ వ్యాపారులు, రైతులకుగానీ ఎటువంటి నష్టం జరగదని, వారు ఎక్కడికైనా వెళ్లగలరని, స్టోరేజీలు మాత్రం ఎక్కడికి వెళ్లలేవన్నారు. మార్కెట్ తరలింపులో భాగంగా త్రీటౌన్ అభివృద్ధి సమితి కన్వీనర్‌గా మెంతుల శ్రీశైలంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
దీంతోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. త్రీటౌన్‌ను అభివృద్ధి చేసుకుందామని, దీనికి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారం కూడా తీసుకుని అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని శ్రీశైలం అన్నారు. చర్చలో నున్నా మాధవరావు, కార్పొరేటర్లు పాలడుగు పాపారావు, ప్రముఖ వ్యాపారులు, కోఆప్షన్ సభ్యులు గీత వెంకన్న, మాటూరి లక్ష్మీనారాయణ, నీలం కృష్ణ, నున్నా సత్యనారాయణ, కొత్త వెంకటేశ్వర్లు, పసుమర్తి రామ్మోహన్, రమాదేవి, దడాల రఘు, కొప్పెర ఉపేందర్, తోట వీరభద్రం, రుద్రగాని ఉపేందర్, పోతుగంటి ప్రవీణ్, కనకం భద్రయ్య, తవిడబోయిన గోపాల్, తోట రామారావు, పెనుగొండ ఉపేందర్, మాటేటి రామారావు, కాసర్ల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.