సీఎం రాక.. అధికారుల్లో కాక | mission bhageeratha works speed up | Sakshi
Sakshi News home page

సీఎం రాక.. అధికారుల్లో కాక

Published Sun, Jul 24 2016 8:47 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

గౌరారం వద్ద పైప్‌లైన్లకు మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

గౌరారం వద్ద పైప్‌లైన్లకు మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

  • గోదారమ్మ కోసం పనులు బిరబిరా
  • గౌరారంలో పుంజుకున్న పనులు
  • ట్యాంకులకు కనెక్షన్లు
  • పైప్‌లైన్లకు అతుకులు
  • పనులు పరిశీలించిన గడా అధికారి హన్మంతరావు  
  • వర్గల్‌: మీ ఊరికి గోదావరి నీళ్లు వస్తున్నయా.. సీఎం కేసీఆర్‌ ప్రశ్న? రావట్లేదు సార్‌.. స్థానికుని సమాధానం.. భగీరథ పనుల తీరు తెలుసుకునేందుకు స్వయంగా సీఎం కేసీఆర్‌ వర్గల్‌ మండలం గౌరారం వద్ద శనివారం సాయంత్రం ఆగారు.

    తన ఫామ్‌హౌస్‌ మార్గంలో రాజీవ్‌ రహదారిపై ఉన్న గ్రామంలో గోదారమ్మ ఇంకా తలుపు తట్టలేదని తెలిసి మౌనంగా ముందుకు సాగిపోయారు. ఆ వెంటనే అధికారుల హడావిడి మొదలైంది. సీఎం ఆగ్రహానికి గురికావలసి వస్తుందని భావించారో ఏమో ఒక్కసారిగా ఆర్‌డబ్ల్యూఎస్,  భగీరథ అధికారులు గోదారి రాకకు అడ్డంకులు గుర్తించారు.

    గ్రామానికి నీరు సరఫరా చేసే 1,40,000 లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు ఓవర్‌హెడ్‌ ట్యాంకులకు గోదావరి జలాలు వచ్చేందుకు పైప్‌లై కనెక్షన్లు ఇచ్చారు. రాజీవ్‌ రహదారి పక్కన గృహాలకు గోదావరి నీరందేలా సీఎం ఫామ్‌హౌస్‌ మార్గంలోని రోడ్డును రాత్రికి రాత్రే తవ్వి పైప్‌లై వేసి పూడ్చేశారు.

    వర్గల్‌–గౌరారం మార్గంలో చౌదరిపల్లి మలుపు వద్ద దెబ్బతిన్న ప్రధాన పైప్‌లై కు మరమ్మతులు చేపట్టారు. గోదావరి జలాల సరఫరా సమయంలో నీటి ఒత్తిడికి పైపులు దెబ్బతినకుండా అక్కడ ప్లాస్టిక్‌పైప్‌ తొలగించి ఇనుప(స్టీల్‌) పైపులు బిగించేపనులు తుదిదశకు చేరాయి.

    కాగా గౌరారంలో పనుల తీరును గడా అధికారి హన్మంతరావు పరిశీలించారు. నిర్లక్ష్యం తగదని సంబంధిత అధికారులను హెచ్చరించారు. కాగా గౌరారం వద్ద, చౌదరిపల్లి మలుపు వద్ద పనులను  భగీరథ డిప్యూటీ ఈఈ కమలాకర్, మండల ఇంఛార్జి స్పెషల్‌ ఈఈ రఘువీర్‌లు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు. రాత్రి వరకు గ్రామంలోని అన్ని ట్యాంకులలోకి గోదావరి జలాలు చేరవేస్తామని డిప్యూటీ ఈఈ కమలాకర్‌ స్పష్టం చేశారు.

    మాకు ఇళ్లకు నీల్లొచ్చెటట్టు..
    సీఎం ఫామ్‌హౌస్‌ రోడ్డుకు రెండో వైపు మా ఇళ్లు ఉంటయ్‌. పైపులై రోడ్డు దాటితెనే ఇంటింటికి నల్లా కనెక్షన్లు వస్తయి. రోడ్డును తవ్వితేనే ఇది సాధ్యమైతది. నిన్న సీఎం సారు మా ఊరిలో ఆగిండు. గోదావరి నీళ్ల గురించి అడిగిండు. ఒక్క ప్రశ్నతోని మా నీళ్ల కనెక్షన్ల బాధ పోయింది. అధికారులు దగ్గరుండి రాత్రికి రాత్రే రోడ్డును తవ్వించి, పైప్‌ వేయించిండ్రు. ఇళ్లకు గోదావరి నీళ్లు వచ్చెటట్టు కనెక్షన్లు ఇచ్చిండ్రు.  – శ్రీనివాస్‌గౌడ్, గౌరారం

    సమస్యకు పరిష్కారం దొరికింది
    ఊరికి నీళ్లు సరఫరా చేసెటందుకు మూడు ట్యాంకులు ఉన్నయ్‌. చౌదరిపల్లి మలుపు కాడ గోదావరి పైప్‌లై సరిగలేకపోవడంతో మా ట్యాంకులకు గోదావరి నీళ్లు వస్తలేవు. దీంతోని బోర్ల నీళ్లతోనే సగబెట్టుకుంటున్నం. మొన్న మీటింగ్‌ల కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ సారుకు కూడా సమస్య చెప్పి, ఊరికి గోదావరి నీళ్లు వచ్చెటట్టు చూడాలె అని కోరిన. అనుకోకుండ సీఎం సారు మా ఊళ్లె ఆగి, గోదావరి నీళ్లు వస్తున్నయా అని అడగడంతో అధికారులు చర్యలు చేపట్టిండ్రు. సారు ఆగడం వల్ల మా సమస్య పరిష్కారమైతున్నది.  – బి.నర్సింహరెడ్డి, సర్పంచ్, గౌరారం

    సీఎం సారు పిలవడంతో భయపడిన
    గౌరారంలో రోడ్డు పక్క కూల్‌డ్రింక్‌ దుకాణం ఉన్నది. ఒక్కసారిగా సీఎం సారు కారు దుకాణం ముందు ఆగడంతో గాబరాకు గురైన. చేయితో సైగ చేస్తూ కారు దగ్గరకు పిలవడంతో మరింత భయపడ్డ. దగ్గరకు పోయిన. గోదావరి నీళ్లు వస్తున్నయా అని సారు అడిగిండు. వస్తలేవని చెప్పిన. ములుగుల వస్తున్నయ్, మీ కెందుకు వస్తలేవు అని అడిగితే పైప్‌లైన్లు పూర్తి కాలేదన్న.  – ఎండీ రఫి, గౌరారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement