సూడుసూడు నల్లగొండ...
గుండెమీద ఫ్లోరైడ్ బండ...
బొక్కలు వొంకరబోయిన
బతుకుల నల్లగొండ జిల్లా...
దు:ఖం వెళ్లదీసేది ఎన్నాళ్లు
నల్లగొండ జిల్లా..?
– కేసీఆర్
(2005లో 25 మంది ఎమ్మెల్యేలు, 5గురు ఎంపీల బృందంతో మర్రిగూడ, నాంపల్లి మండలాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించి గుక్కెడు నీళ్లు కరువైన జీవితాలపై దుఃఖంతో కేసీఆర్ రాసిన పాట)
ప్రతి మనిషికి మంచినీళ్లు ప్రాథమికహక్కు. గంగా, గోదావరి, కృష్ణా లాంటి జీవనదులు ప్రవహించే చోట నేటికీ మంచినీళ్లకోసం అల్లాడుతున్న ప్రజల జీవన ముఖచిత్రం నా దేశ చిత్రపటంగా కనిపిస్తుంది. ఈ దుస్థితికి గతకాలాన్నే నేరస్తునిగా నిలబెట్టాలా? ప్రజలకోసం పనిచేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణంచేసిన గతకాలపు పాలకులదే ఆ నేరం అందామా? ప్రజలకు మాత్రం దోసిళ్లలోకి శుద్ధ మంచినీళ్లు రావాలన్నదే కోరిక. మంచినీళ్లు పొందటం కోసం అల్లాడిన జనాన్ని గతకాలం చూసింది. మంచినీళ్లకోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి బిందెలతో మోసుకొచ్చిన మన తల్లుల బొప్పికట్టిన మాడలు చెబుతాయి. కన్నీళ్ల గోసను, మంచినీటి కోసం పడ్డ వెతలను చెబుతాయి. చెప్పుల్లేని కాళ్లతో కోసులకొద్ది దూరం నడిచిన ఆ తల్లుల పాదాలు కాయలు కాసిన కాళ్లు చారిత్రక సత్యాలను చెబుతాయి.
ఈ దుస్థితికి నిలువెత్తు నిదర్శనం మా ఉమ్మడి నల్లగొండ జిల్లా. మంచినీళ్లు దొరకని కరుడుకట్టిన ఫ్లోరైడ్ జిల్లాగా దేశంలోనే పేరుపడ్డది. ఫ్లోరైడ్ అత్యధికంగావున్న జిల్లాల్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాతోపాటు మా నల్లగొండ జిల్లాకూడా ఉంది. నీళ్లందని భూములు, గొంతుతడవని నాలుకలు మొత్తంగా మంచినీళ్లకోసం అల్లాడిన గోసకు సజీవ తార్కాణం నా నల్లగొండ పోరునేల. ఈ ప్రజలకు మంచినీళ్లు కూడా అందించలేని గతకాలపు నాయకులంతా ప్రపంచ మానవహక్కుల కోర్టుల్లో నిలబడాల్సిందే. ఈ దుస్థితి మారాలని కన్నీళ్లను నీళ్లుగా తాగే ప్రజలు మంచినీళ్ల సాక్షిగా ఎన్ని ఉద్యమాలు చేసినా, దుశ్చర్ల సత్యనారాయణ లాంటి సంఘజీవులు ఎంతెంత దుఃఖించి ఉద్యమించినా, సాక్షాత్తు ఆనాటి ప్రధాని వాజ్‌పేయి ఫ్లోరోసిస్ బాధితుల్ని కళ్లారా చూసి కరిగిపోయిన నల్లగొండ జిల్లా నీటివెతలు తీరలేదు. ఒక్క నల్లగొండ జిల్లానే కాదు ఆనాటి తెలుగు సమాజంలో నీళ్లందని వూళ్లెన్నెన్నో ఉన్నాయి. ఇది తీరని గోసగా ఉంది. ఇది గుండెల్ని పిండిచేసిన దృశ్యాలు తెలంగాణలోని ఎన్నెన్నో మారుమూల గ్రామాల్లో ఉన్నాయి. పేర్లెందుకు, కాలపట్టికలెందుకు గానీ నల్లగొండ జిల్లాలో కొన్ని ఫ్లోరోసిస్ పీడిత గ్రామాల పిల్లలకు పెళ్లి సంబంధాలు పెట్టుకోవాలంటే కూడా జంకిన స్థితి ఆనాటి కాలదుస్థితి.
చెలిమల నీళ్లు తాగి దప్పిక తీర్చుకున్న తరాన్ని నా తెలంగాణ చూసింది. నా తెలంగాణ నీళ్లందని దప్పిక తీరని కోట్లమంది కన్నీళ్లవానగా నిలిచింది. రెండు దశాబ్దాల క్రితం ఏ దినపత్రిక చూసిన ఎక్కడో ఒకచోట కోసులకొద్ది నీళ్లకోసం నడిచిన తల్లుల పాదముద్రలే కనిపిస్తాయి. నల్లగొండ జిల్లాలో ఉద్యమకాలంలో కేసీఆర్ పల్లెయాత్రలు చేసుకుంటూ వూరూరా తిరుగుతున్నప్పుడు నీళ్లకోసం మునుగోడు, సంస్థాన్ నారాయణపూర్, ఫ్లోరోసిస్ పీడిత గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు చూసి కన్నీళ్లు పెట్టుకుని కవితలల్లి పాటలురాసి పాడారు. అవును, నీళ్లందని వూళ్లు, మంచినీళ్లకోసం అరిచిఅరిచి ఉద్యమించి ఈ నేలపై నీళ్లధారల్ని ప్రవహింపజేసి ఇక్కడ గంగమ్మను పారించే భగీరథుని కోసం తెలంగాణ ఎదురుచూసింది నిజం. ఈ నేలపై నీళ్లను పారించే ఉద్యమ ఋష్యశృంగుని రాకకోసం నా తెలంగాణ కలవరించింది సత్యం. దీన్ని ఏ చరిత్రా కాదనలేనిది.
కేసీఆర్ అటు ఉద్యమంలో గెలిచాడు. తెలం గాణ రాష్ట్రం వచ్చింది. ప్రజలు కేసీఆర్‌నే గెలిపిం చారు. ఫ్లోరోసిస్ రక్కసి నుంచి ప్రజలకు విముక్తి లభించింది. ఇపుడు తమ ఇంటిలోకి వచ్చిన స్వచ్ఛ జలాలను తమ దోసిళ్లలోకి తీసుకుని చూసుకున్నప్పుడు ఆ గంగమ్మలో కేసీఆర్ ముఖచిత్రం కనిపిస్తుంది. నీడనిచ్చిన చెట్టును, నీళ్లనిచ్చిన మనిషిని ఈ నేల మరువదు. ఇది ఒక కవి వర్ణనకాదు. ఇది ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాల ప్రజల వర్ణించలేని పరమానంద పరవశమే. ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాల్లో మంచి నీటి ఆశల జల పుట్టింది.
‘‘తెలంగాణ రాకముందు 967 గ్రామాల్లో ఫ్లోరోసిస్ విస్తరించి ఉంది. మిషన్ భగీర«థతో ఆ గ్రామాల్లో ఫ్లోరోసిస్ లేకుండా పోయిందని పార్లమెంటులో కేంద్రం ప్రకటించింది. మిషన్ భగీరథ టీమ్‌కు అభినందనలు’’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన సందేశం చదివాక అమితానందం అనిపిం చింది. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయం. నల్లగొండ జిల్లాలో గత ఆరేండ్లుగా ఒక్క ఫ్లోరోసిస్ కేసు నమోదు కాకపోవటం తెలంగాణ ప్రభుత్వం కృషికి నిదర్శనం. కార్యసాధకుడైన కేసీఆర్ 2015 మార్చి 17న శాసనసభలో మాట్లాడుతూ ‘‘వాటర్ గ్రిడ్‌ను నాలుగు సంవత్సరాలలో పూర్తిచేస్తాము. ప్రతి గుడిసెకు, ఇంటికి ట్యాప్ ఇస్తాము. నాలుగున్నర సంవత్సరాల గడువు తరువాత తెలంగాణలో ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని బజారులో కనిపించకూడదని మా ధ్యేయం. నాలుగున్నర సంవత్సరాల నాటికి ప్రతి ఇంటికి నీరు ఇవ్వకుంటే, రాబోయే ఎన్నికలలో మా పార్టీ ఓట్లు అడగదు’’ అని ధైర్యంగా ప్రకటించడం జరిగింది అన్నట్లుగానే మిషన్ భగీరథను పూర్తిచేశారు.
ఫ్లోరోసిస్ భూతం ఈ నేలను వదిలివెళ్లటంతో పాలబుగ్గల పసినవ్వుల పళ్లవరుసలు పారే తెల్లటి జలపాతంలాగా మెరిసిపోతున్నాయి. మనిషి శరీరానికి పట్టిన ఫ్లోరోసిస్ తొలగించగలిగారు. ఇంటిం టికీ వచ్చిన మంచినీళ్లు ఇపుడు వొంకర్లు కొంకర్లు తిరిగిన గ్రామాలకు ఆయురారోగ్యాలనిస్తున్నాయి. ఇది ఆరోగ్యవంతమైన సమాజానికి మంచి పునాది. ఈ నేలమీద ఎగిసిన ఫ్లోరోసిస్ వ్యతిరేక ఉద్యమాలన్నింటికి ఇంటింటికీ వచ్చిన నల్లా నీళ్లతో విముక్తి లభించినట్లయ్యింది. ఇపుడు మా నల్లగొండ దేశ పీఠం మీద ఆరోగ్యకొండగా నిలుస్తుంది. తెలం గాణ పునర్నిర్మాణంలో ఇది ఒక భగీర«థమైన అడుగు. ఇదొక మంచిముందడుగు.
వ్యాసకర్త : జూలూరు గౌరీశంకర్, ప్రముఖ కవి, సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 94401 69896
Comments
Please login to add a commentAdd a comment