ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు చౌటుప్పల్ సమీపంలో కేటాయించిన స్థలం
సాక్షి, నల్లగొండ: దక్షిణ భారతదేశంలోని ఫ్లోరోసిస్ బాధితుల ఆరోగ్యం కోసం 2008–09లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతీయ పరిశోధన కేంద్రం కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపించడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ ప్రాంతంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం 8 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది. కానీ, ఈ ఏడాది జూన్ 26వ తేదీన ‘ఫ్లోరోసిస్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం మా పరిధిలోకి రాదు అందుకే నిధులు కేటాయించలేదు..’ అని కేంద్ర ఆరోగ్య శాఖ తేల్చేసింది.
మరి ఇప్పటి దాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, రాష్ట్ర ప్రభుత్వం 2014లో చౌటుప్పల్‌లో కేటాయించిన 8 ఎకరాల స్థలం దేనికోసం, ఎవరికోసమన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో కేంద్రం ప్రభుత్వం తెలంగాణపై చిన్నచూపు చూపుతోందన్న విమర్శలకు బలం చేకూరుతోంది. దక్షిణభారత రాష్ట్రాలకు ఉద్దేశించిన ప్రాంతీయ ఫ్లోరోసిస్ పరిశోధన కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. అయినా ఇప్పటి వరకు రీసెర్చ్ సెంటర్ శంకుస్థాపనకు నోచుకోలేదు.
నిరాశేనా !
తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో ఫ్లోరోసిస్ పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు గతంలోనే కేంద్రం ఆమోదముద్ర వేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పాండిచ్చేరి, గోవా, అస్సాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల కోసం నల్లగొండలో రూ.100 కోట్లతో ‘రీజనల్ ఫ్లోరోసిస్ మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ (ఆర్.ఎఫ్.ఎం.ఆర్.సి) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. సరికదా తాజాగా, అసలు ఆ కేంద్రం తమ పరిధిలోకి రాదని, అందుకే బడ్జెట్ ఇవ్వలేమని కేంద్ర ఆరోగ్య శాఖ బాంబు పేల్చింది. ఉమ్మడి రాష్ట్రంలోనే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సహకారంతో చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురంలో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది.
ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును 100 నుంచి 250 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రంలో భాగంగా తొలుత 20 పడకలతో ఆసుపత్రి నిర్మిచాల్సి ఉంది. కాగా, ఇప్పటికీ చౌటుప్పల్‌లో ఈ కేంద్రం ఏర్పాటు అతీగతీ లేదు. జిల్లాలో రమారమి 2 లక్షల మంది దాకా ఉన్న ఫ్లోరోసిస్ బాధితులకు ఈ కేంద్రం వల్ల ప్రయోజనం చేకూరుతుందేమోనని ఆశపడినా.. వారికి నిరాశే మిగిలింది. మంజూరైతే చేసింది కానీ, కేంద్ర ప్రభుత్వానికి మొదటి నుంచి ఈ రిసెర్చ్ సెంటర్ ఏర్పాటుపై చిత్తశుద్ధి లేదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఇక, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇతర సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఫ్లోరైడ్ సమస్య దూరమవుతుందన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పరిశోధన కేంద్రంపై దృష్టిపెట్టలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రాజకీయాలు పక్కన పెట్టండి
గత ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యమంత్రి హో దాలో జె.పి.నడ్డా ఇస్తామన్న ఫ్లోరోసిస్ భాదితుల ప్రత్యేక దవాఖాన, తెస్తామన్న ఫ్లోరోసిస్ రిసేర్చ్ సెంటర్ మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్‌టీఐ కింద వివరాలు అడిగితే ‘మా పరిధి లోని అంశం కాదు అందుకే నిధులు కేటాయించట్లేదు‘ అని తెలిపింది. తెలంగాణలో అత్యంత ముఖ్యమైన ఫ్లోరోసిస్ బాధితుల సంక్షేమం మీద రాజకీయాలు పక్కకు పెట్టి కేంద్రం ఆలోచించాలి. హాస్పిటల్, రిసెర్చ్ సెంటర్ వెంటనే ఏర్పా టు చేయాలి.
– సుధీర్, అధ్యక్షుడు, ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment