గుత్తిలో ఎమ్మెల్యేకు చుక్కెదురు
– ఎమ్మెల్యేను చుట్టుముట్టిన జెండా కాలనీవాసులు
– కమిషనర్, చైర్ పర్సన్‌లపై ఎమ్మెల్యే ఆగ్రహం
గుత్తి : రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జితేందర్ గౌడ్‌కు కాలనీవాసుల నుంచి చుక్కెదురైంది. పట్టణంలోని జెండావీధిలో నాగరాజు స్టోర్ వద్ద మంగళవారం చంద్రన్న రంజాన్ తోఫా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. రంజాన్ తోఫాను ముస్లింలకు పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమం ముగుస్తున్న సమయంలో ఒక్కసారిగా జెండా వీధి కాలనీవాసులు స్టేజి వద్దకు దూసుకెళ్లారు. రంజాన్ తోఫా సంగతి పక్కన బెట్టండి ముందు కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. ఎమ్మెల్యే నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కూడా వినలేదు.
గత 15 రోజులుగా కాలనీకి నీళ్లు వదలలేదన్నారు. ఈ రోజు మీరు వస్తున్నారనే కారణంతో హడావుడిగా నీళ్లు వదిలారన్నారని ఆగ్రహించారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్ ఇబ్రహీం సాబ్, చైర్ పర్సన్ తులశమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్య ఉందని తనకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. మీకు చేత కాకపోతే నాకు చెప్పండి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అప్పటికీ జనాలు శాంతించకపోయే సరికి చేసేది లేక కోపంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.