పన్నుల పేరిట దోపిడీ
పన్నుల పేరిట దోపిడీ
Published Sat, Mar 11 2017 10:14 PM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM
టీడీపీ పాలనలో సామాన్యులపై ఇంటి పన్నుల పెనుభారం
ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆగ్రహం
రావులపాలెంలో ర్యాలీ, రాస్తారోకో, ధర్నా
రావులపాలెం (కొత్తపేట) : కల్లబొల్లి హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం నేడు పన్నుల పేరుతో ప్రజల ను దోచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. జిల్లాలో ఇంటి పన్నుల పెంపును నిరసిస్తూ శనివారం రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. స్థానిక కళావెంకట్రావు సెంటర్ నుంచి జాతీయ రహదారిపై రావులపాడు జంక్షన్ వరకూ తిరిగి అక్కడ నుంచి పంచాయతీ కార్యాలయం వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు. కళావెంకట్రావు సెంటరులో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి పెంచిన పన్నులు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన సంక్షేమం, కుమారుడు లోకేష్ సంక్షేమం కోసం పనిచేస్తున్నారని ఎద్దేవా చేశా రు. ఇంటి పన్నులు 200 నుంచి 300 శాతం పెంచడమే కాకుండా నీటి, డ్రైనేజీ, లైటింగ్ పన్నులు అంటూ ప్రజలకు తెలియకుండానే వారిపై భారం మోపుతున్నారన్నారు. పింఛన్ సొమ్మును సైతం ఇంటి పన్నుగా మినహాయించుకుని బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. మూడేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా నిర్మించని ప్రభుత్వం ఇంటి పన్నులు మాత్రం భారీగా పెంచి సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. ఇంటి పన్నులు తగ్గించేంత వరకూ వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. తప్పుడు కేసులు పెట్టాలని చూసినా భయపడేది లేదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని అయితే టీడీపీ ప్రభుత్వం 144 , సెక్షన్ 30 అంటూ ప్రజల హక్కులను కాలరాస్తోందన్నారు. అనంతరం పంచా యతీ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. పన్నుల తగ్గించాలంటూ కార్యదర్శి దుర్గాప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనకు సీపీఐ మండల కార్యదర్శి కర్రి రామిరెడ్డి మద్దతు పలికారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్, వైస్ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యవర్మ, జిల్లా సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధరరావు, మండల కన్వీనర్లు దొమ్మేటి అర్జునరావు, తమ్మన శ్రీను, కనుమూరి శ్రీనివాసరాజు, ముత్యాల వీరభద్రరావు, జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ద్వారంపూడి సుధాకరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement