బాబోయ్ ఆయనా..! నున్నగా వాడెస్తారు..
బాబోయ్ ఆయనా..! నున్నగా వాడెస్తారు..
Published Tue, Aug 8 2017 11:01 PM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM
- ఎమ్మెల్యే కొండబాబుపై అసమ్మతి బుస
– ఒంటెద్దు పోకడపై మండిపడుతున్న సీనియర్లు
– కార్పొరేషన్ ఎన్నికల్లో వేరుకుంపటి పెడతామంటున్న అసంతృప్తివాదులు
గడిచిన ఎన్నికల్లో సామాజికంగా కొమ్ముకాసి గెలుపునకు కృషి చేసిన నేతలను ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) పక్కన పెట్టేశారు. ఆయనతో వెళితే వాడుకుని వదిలేస్తారు.. తస్మాత్ జాగ్రత్తని టీడీపీ శ్రేణులను అసమ్మతి నేతలు అంతర్గతంగా అప్రమత్తం చేస్తున్నారు. ఒంటెద్దు పోకడలతో వెళుతున్న కొండబాబుపై అసమ్మతి బుస కొడుతూనే ఉంది. కార్పొరేషన్ ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామంటూ అసంతృప్తివాదులు హెచ్చరిక సంకేతాలు పంపిస్తున్నారు.
- సాక్షి ప్రతినిధి, కాకినాడ
2014 ఎన్నికల్లో కొండబాబు గెలుపునకు ఎంతో కష్టపడిన నున్న దొరబాబును ఆ తరువాత గడ్డి పోచలా తీసిపారేశారు. ఆయనెక్కడ పట్టు పెంచుకుని పోటీగా తయారవుతారేమోనన్న అభద్రతా భావంతో వ్యూహాత్మకంగా వదిలించుకునే ప్రయత్నం చేశారు. తొలుత పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత పార్టీ సమావేశాలకు పిలవకుండా, పార్టీలో ఎదగనీయకుండా అదే పనిగా అనుచరులతో అవమానాల పాల్జేశారు. అంతటితో ఆగకుండా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే తన అనుచరులతో ఉప ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయించారు. ఈ విషయం నున్న వర్గీయులను కలచివేసింది. పార్టీలో పొమ్మనకుండా పొగబెడుతున్నారంటూ ఆ వర్గం ఏకంగా నిమ్మకాయల చినరాజప్పను నిలదీసింది. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, తన అనుచరులు నగరంలో చేస్తున్న ఆగడాలు, అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు, కాపు సామాజిక వర్గ నేతగా అనతి కాలంలో ఎదుగుతున్నందన తట్టుకోలేక నున్న దొరబాబును టార్గెట్ చేశారు. ఒక్క దొరబాబునే కాదు కాపు సామాజిక వర్గ నేతలు అనేక మందిని ఇదే రకంగా వివక్షకు గురి చేశారని ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా పార్టీలోకి ఎవరినైనా ఆహ్వానిస్తే ఆయన వెనక వెళ్లొద్దని.. వాడుకుని వదిలేస్తారని నున్న దొరబాబు వర్గీయులతో పాటు ఎమ్మెల్యేతో రాజకీయంగా నష్టపోయిన వారంతా అంతర్గతంగా నూరుపోస్తున్నారు.
వేరుకుపంటి దిశగా అసమ్మతి వాదులు
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని పట్టాలెక్కించి, గెలిచాక అవమానాల పాలైన నాయకులంతా తమ సత్తా చూపించాలని యోచిస్తున్నారు. ఈ తమను సంప్రదించకుండా సీట్లు కేటాయించిన చోట వేరే కుంపటి పెడతమని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పేలా ప్రతి డివిజన్‌లో తమ వర్గానికి చెందిన నాయకుడిని నిలబెడతామని సంకేతాలు పంపిస్తున్నారు. అవసరమైతే వనమాడి అభ్యర్థులను ఓడించి తీరుతామని శపథం పూనుతున్నారు. దీంతో టీడీపీలో గుబులు పట్టుకుంది.
భయం గుప్పెట్లో తేదేపా!
తేదేపాలో మొదలైన ముసలం రోజురోజుకీ పెరిగిపోతుండడంంతో పార్టీ వర్గాల్లో గుబులు పట్టుకుంది. ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలతో నడుస్తున్నారని, అభ్యర్థుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, చివరికీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబుని సైతం సంప్రదించడం లేదని అసమ్మతివాదులు గగ్గోలు పెడుతున్నారు. అసలే ప్రభుత్వం అప్రతిష్టపాలైందని, ఈ నేప««థ్యంలో అసమ్మతి కూడా ఎక్కువవడంతో విజయం కష్టమేనని టీడీపీ శ్రేణులు భయపడుతున్నాయి.
Advertisement