చైతన్యపురి: ‘బాబు వస్తే జాబులు’ వస్తాయని నిరుద్యోగులు కలలుగన్నారని..అయితే బాబు వచ్చినా జాబులు మాత్రం రాలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 1.50 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని లేని పక్షంలో లక్ష మందితో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం దిల్‌సుఖ్‌నగర్ ఏపీ నిరుద్యోగ గర్జన నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ఖాళీగా ఉన్న 18వేల కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణాలో పోరాడి సాధించుకున్న ఐదేళ్ల వయోపరిమితిని సడలింపును ఏపీలో కూడా ఇవ్వాలన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలను ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు. శ్రీనివాస్, రాంబాబు, కరుణ, వెంకటేశ్వర్లు, వినోద్, అశోక్ పాల్గొన్నారు.