
సాగునీరిద్దామన్న ధ్యాసేదీ?
వజ్రకరూరు (ఉరవకొండ) : హంద్రీ-నీవా డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తిచేసి ఆయకట్టుకు సాగునీరు ఇద్దామన్న ధ్యాసే ప్రభుత్వానికి లేదని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతల దృష్టంతా ప్రజాధనాన్ని ఎలా దోపిడీ చేయాలి అనే దానిపైనే ఉందని, వారికి రైతుల సంక్షేమం ఏమాత్రం పట్టడం లేదని దుయ్యబట్టారు. వజ్రకరూరు మండలం చిన్నహోతూరు సమీపంలో ఆగిపోయిన హంద్రీ - నీవా« సుజల స్రవంతి ధర్మపురి డిస్ట్రిబ్యూటరీ పనులను ఆదివారం వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు.
హంద్రీ - నీవా మొదటి దశ కింద ఉరవకొండ నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించినా ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. కాలువల్లో నీరు పారుతున్నా ఆయకట్టుకు ఇవ్వకుండా రైతులను నిలువునా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది జిల్లాకు 29 టీఎంసీల మేర కృష్ణా జలాలు వచ్చాయని, అంతకుముందు 16 టీఎంసీల మేర నీరు జిల్లాకు వచ్చిందన్నారు. 2012 నుంచి కృష్ణాజలాలు వస్తున్నా ఆయకట్టుకు చుక్కనీరు అందించలేదని మండిపడ్డారు. ఆయకట్టుకు నీరిస్తే ఈ ప్రాంతంలో బంగారు పంటలు పండుతాయని, రైతులంతా బాగుపడతారని అన్నారు. గత ఆగస్టులోనే ఆయకట్టుకు నీరిస్తామని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్మపురి డిస్ట్రిబ్యూటరీ కాలువకు రూ.5 కోట్లు కేటాయిస్తే పనులు పూర్తవుతాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా నియోజకవర్గంలో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు తీసుకురాలేనందుకు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సిగ్గుపడాలన్నారు. రైతులను మభ్యపెట్టేందుకు ఇప్పుడు హంద్రీ- నీవా ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని కేశవ్ అంటున్నారన్నారు. సాగునీటిపై మాట్లాడే నైతిక హక్కు కేశవ్‌కు ఏమాత్రం లేదన్నారు. హంద్రీ- నీవా మొదటి దశకింద రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన తరువాతే ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొర్రా వెంకటమ్మ, వైస్ ఎంపీపీ నారాయణప్ప, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జయేంద్రరెడ్డి, ఉస్మాన్, జిల్లాకార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, నాయకులు మన్యం ప్రకాష్, కాకర్ల నాగేశ్వరరావు, పీఏసీఎస్ డైరెక్టర్ భరత్‌రెడ్డి, విజయ్, ప్రసాద్‌రెడ్డి, పూజారి సురేష్, ఆది, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.