
ఎమ్మెల్సీలకు బడ్జెట్ లో ప్రత్యేక నిధులు
ప్రభుత్వానికి నివేదిస్తా: స్వామిగౌడ్
మెదక్: ఎమ్మెల్సీలకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని, ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిస్తామని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. గురువారం మెదక్ పట్టణంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీలకు తగిన గుర్తింపు లేదన్న విషయం వాస్తవమేనని చెప్పారు. అయితే, ఎమ్మెల్సీలు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తే దానిపై చర్చించి తగు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని చెప్పారు. పార్టీ మారిన సభ్యుల విషయమై న్యాయనిపుణులతో చర్చిస్తామని పేర్కొన్నారు.