సీసీ పుటేజీల దెబ్బకు టీడీపీకి బొప్పి
సీసీ పుటేజీల దెబ్బకు టీడీపీకి బొప్పి
Published Thu, Mar 2 2017 12:01 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
- ఎమ్మెల్సీ ఎన్నికలో పారని ‘దేశం’ పాచిక
- బలముండీ భయపడుతున్న అధికార పార్టీ
ప్రలోభాలు, బెదిరింపులు, అధికార దుర్వినియోగంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఎన్నిక లేకుండా చేయాలనే అధికార తెలుగుదేశం పార్టీ పాచిక పారలేదు. రెండురోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. వారి వ్యూహాలు బెడిసికొట్టాయి. తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటేస్తారనే నమ్మకం లేక ఎన్నికలకు వెళ్లేందుకు ఆ పార్టీ నేతలు భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. లేదంటే పార్టీకి స్థానిక సంస్థల్లో మూడింట రెండు వంతుల మెజార్టీ ఉన్నప్పటికీ దొడ్డిదారిన స్వతంత్ర అభ్యర్థిని బరి నుంచి తప్పించేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఏమొచ్చిందో!
సాక్షిప్రతినిధి, కాకినాడ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు పదవీ కాలం మే 1తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. టీడీపీ తరఫున మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, స్వతంత్ర అభ్యర్థులు ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్‌ల పరిశీలనకు గడువు బుధవారం. చిక్కాలతో పాటు స్వతంత్రులు దూళిపూడి వీరవెంకటనాగేంద్రప్రసాద్, రాయపురెడ్డి జానకిరామయ్య, కుడుపూడి రామకృష్ణ, మాకే దేవీప్రసాద్, యాట్ల నాగేశ్వరరావుల నామినేషన్ల పరిశీలనను రిటర్నింగ్ అధికారి, జేసీ ఎస్.సత్యనారాయణ కలెక్టరేట్‌లో చేపట్టారు.
ఫలించని దొడ్డిదారి యత్నాలు
ఈ ఆరుగురులో నలుగురు స్వతంత్రులు నామినేషన్లు సక్రమంగా పూర్తి చేయకపోవడంతో తిరస్కరించారు. టీడీపీ అభ్యర్థి చిక్కాల నామినేషన్ సక్రమంగా ఉందని ప్రకటించారు. స్వతంత్రులు ఐదుగురులో ద్రాక్షారామకు చెందిన యాట్ల నాగేశ్వరరావు నామినేషన్‌ను కూడా దొడ్డిదారిన తిరస్కరించేందుకు అధికార పార్టీ నేతలు చేయని ప్రయత్నమంటూ లేదు. నాగేశ్వరరావు నామినేషన్‌ను ఏదోరకంగా తిరస్కరిస్తే ఎన్నికలకు వెళ్లనవసరం లేకుండా ఏకగ్రీవం చేసుకోవాలనే టీడీపీ నేతల వ్యూహాన్ని కలెక్టరేట్‌లో ఉన్న సీసీ పుటేజీలు దెబ్బతీశాయి. నాగేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ సంతకాలు చేసిన 10 మంది స్థానిక సంస్థల ప్రతినిధుల్లో రామచంద్రపురం మండలం తోటపేటకు చెందిన ఎంపీటీసీ అల్లం సత్యనారాయణమ్మ ఒకరు. నామినేషన్‌ల పరిశీలన సమయంలో నాగేశ్వరరావును బలపరుస్తున్నట్టుగా తాను సంతకం చేయలేదని ఆమెతో ఆర్‌వో సత్యనారాయణ వద్ద చెప్పించారు. అధికార పార్టీ నేతలు గడచిన రెండు రోజులుగా చేస్తున్న ఒత్తిళ్లు, బెదిరింపులు, ప్రలోభాలతో మరోదారి లేకనే ఆ సంతకం తనది కాదని ఆమె చెప్పి ఉంటారని విజ్ఞులు విశ్లేషిస్తున్నారు. అసలు నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేయడానికి మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చినప్పుడే టీడీపీ నేతలు నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు. అయినా ఆయన ఎలాగోలా తప్పించుకుని నామినేషన్ దాఖలు చేశారు. తెలుగు యువత నాయకుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాగేశ్వరరావును బరిలో నుంచి తప్పించేందుకు స్వయంగా ఒక మంత్రి రంగ ప్రవేశం చేసి రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన పలువురికి ఫోన్‌చేసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం బెడిసికొట్టడంతో సాంకేతికంగా నామినేషన్‌ను తొసిపుచ్చాలని ఎత్తుగడ వేశారు. అందుకే ప్రతిపాదకురాలైన నారాయణమ్మను బలవంతం చేసి సంతకం చేయలేదని చెప్పించారని స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వరరావు పేర్కొనడం గమనార్హం.
పట్టిచ్చిన సీసీ పుటేజీలు
ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు నామినేషన్‌కు ప్రతిపాదిస్తూ సత్యనారాయణమ్మ చేసిన సంతకాన్ని, ఎంపీటీసీగా ఎన్నికైనప్పుడు తొలిసారి ఎంపీడీఓ కార్యాలయంలో రిజిస్టర్‌లో చేసిన సంతకాన్ని సరిపోల్చి చూశారు. ఆ సంతకం ఇదీ ఒకటేనని తేల్చారు. నాగేశ్వరరావును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై ఆర్‌వో చాంబర్‌లో ఆమె సంతకం చేస్తున్నట్టు సీసీ పుటేజీలలో నమోదైన విషయం అధికారుల పరిశీలనలో తేటతెల్లమైంది. దీంతో ఆమె సంతకం వాస్తవమేనని తేల్చి నాగేశ్వరరావు నామినేషన్ సక్రమంగా ఉన్నట్టు ఎన్నికల పరిశీలకుడు కరికాల వల్లవన్, ఆర్‌వో సత్యనారాయణ ప్రకటించారు.
ఆ ఐదు గంటలు హైడ్రామా...
మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కలెక్టరేట్‌లో హైడ్రామా నడిచింది. నామినేషన్ల పరిశీలన జరుపుతున్న జాయింట్ కలెక్టర్ చాంబర్ చుట్టూ టీడీపీ శ్రేణులు మోహరించాయి. ఒకపక్క తప్పుకోమని నాగేశ్వరరావును బలవంతం చేస్తూనే మరోపక్క సత్యనారాయణమ్మ సంతకం చేయలేదని చెప్పించే ప్రయత్నం చివరి వరకు చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పరిశీలన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ముగిసింది. కానీ ఒక్క నాగేశ్వరరావు నామినేషన్ విషయం రాత్రి ఏడు గంటల వరకు తేల్చలేదు. మొత్తం మీద టీడీపీ వ్యూహం బెడిసికొట్టడంతో ఆ పార్టీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయపడినట్టయింది. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు ముగిశాక ఎన్నిక జరుగుతుందా లేక ఏకగ్రీవమా అనేది తేలనుంది.
Advertisement
Advertisement