సమరానికి సై
సమరానికి సై
Published Tue, Feb 14 2017 12:29 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
- మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం..తొలిరోజు నిల్
- రేపటి నుంచి ఊపందుకోనున్న నామినేషన్ల పర్వం
- పట్టభద్ర ఓటర్లు 2.53 లక్షలు, ఉపాధ్యాయ ఓటర్లు 20,644
- పట్టభద్రుల కోటాలో వెన్నపూస గోపాల్‌రెడ్డి, గేయానంద్, కేజేరెడ్డి మధ్య పోరు
- ఉపాధ్యాయ కోటాలో కత్తి నరసింహారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, ఒంటేరు, బచ్చల కీలకం
- కత్తి నరసింహారెడ్డికి వేధిస్తున్న నాన్ లోకల్ సమస్య
జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇప్పటి వరకూ ఎలాంటి ఎన్నికలూ జరగలేదు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ ఎన్నికలపై అన్ని పార్టీలూ దృష్టి సారించాయి. రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం నుంచి పట్టభద్రులు, ఉపాధ్యాయ కోటాలో ఎన్నికలు జరగనున్నాయి. బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. వీరంతా ప్రచార పర్వంలో నిమగ్నమయ్యారు. తొలిరోజు ఒక్క నామినేష¯ŒS కూడా దాఖలు కాలేదు. మంగళవారం కావడంతో నేడు కూడా నామినేషన్లు దాఖలు కాకపోవచ్చు. కీలక నేతలంతా రేపు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో రేపటి నుంచి నామినేషన్ల పర్వం ఊపందుకోనుంది.
(సాక్షిప్రతినిధి, అనంతపురం)
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ గత ఏడాది నవంబర్ 5తో పూర్తయ్యింది. అప్పటి లెక్క ప్రకారం రాయలసీమ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 2, 53,515 మంది పట్టభద్రులు, 20, 644 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. తిరిగి ఈ నెల 7 నుంచి 20 వరకూ కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల కమిష¯ŒS అవకాశమిచ్చింది. అయితే.. ఓటరు దరఖాస్తు పరిశీలనకు కనీసం వారం రోజుల గడువు తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఈ నెల 13 అర్ధరాత్రి వరకూ నమోదు చేసుకున్న వారు కచ్చితంగా ఓటుహక్కు పొందుతారు. ఆపై దరఖాస్తు చేసుకునేవారి ఓటు నమోదు కావొచ్చు, కాకపోవచ్చు. దరఖాస్తుదారుల సర్టిఫికెట్లను పరిశీలించి 20వ తేదీ తుది జాబితాను ఖరారు చేస్తారు. దీంతో ఓట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
పట్టభద్రుల కోటాలో పోటీ రసవత్తరం
పట్టభద్రుల కోటాలో పోటీ రసవత్తరంగా ఉండనుంది. గత ఎన్నికల్లో ఊహించని విధంగా సీపీఎం అభ్యర్థి గేయానంద్ విజయం సాధించారు. రెండోసారీ ఈయన సీపీఎం అభ్యర్థిగానే బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థులు లేకపోవడం గేయానంద్‌కు కలిసొచ్చింది. గేయానంద్‌తో పాటు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్‌జిల్లా సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య మధ్యనే పోటీ సాగింది. శ్రీధర్‌రెడ్డి ఆర్థికబలాన్ని నమ్ముకుని ఓటమిపాలయ్యారు. ఈశ్వరయ్య మూడోస్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి బరిలో నిలిచారు. ఈయన వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ తరఫున కేజేరెడ్డి బరిలో నిలిచారు. బరిలో ఇంకా చాలామంది ఉన్నా ఈ ముగ్గురి మధ్యే పోటీ కీలకం కానుంది. రాయలసీమలో అధికార, ప్రతిపక్షాలతో పోలిస్తే సీపీఎం బలం చాలా తక్కువ. పైగా గేయానంద్ రెండోసారి బరిలో నిలుస్తుండటంతో స్వతహాగా ఓటర్లు ఆయన వైపు మొగ్గుచూపే అవకాశాలు తక్కువ. రాయలసీమ అభివృద్ధి వేదిక మద్దతు ఉందంటూ గేయానంద్ ప్రచారం చేసుకున్నారు. అయితే.. కర్నూలు నుంచి బరిలో నిల్చున్న మరో అభ్యర్థి నాగార్జునరెడ్డి తమదే నిజమైన రాయలసీమ అభివృద్ధి వేదిక అంటూ గేయానంద్‌కు ఝలక్ ఇచ్చారు. ఇవన్నీ ఆయనకు ప్రతికూలాంశాలు. కేజేరెడ్డి రాయలసీమలో ఇప్పటి వరకూ తెలియని పేరు. ఈయన రియల్టర్. ప్రజా సమస్యలపై పోరాడిన దాఖలాలేవీ లేవు. డబ్బు, అధికారపార్టీ అండపైనే ఆధారపడ్డారు. ఈయన సొంత జిల్లా కర్నూలుతో పాటు వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం ఎక్కువ. ఈయన కొరియర్ ద్వారా కరపత్రాలను ఇళ్లకు పంపిస్తూ హైటెక్ ప్రచార మార్గంలో వెళుతున్నారు. ఇవన్నీ ప్రతికూలాంశాలే. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా పోరాడిన వ్యక్తి. ఈయనకు సీమలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. దాదాపు ప్రతి ఓటరుకు ఇప్పటికే పరిచయమున్న వ్యక్తి, పైగా గత ఐదు నెలల నుంచి పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న కర్నూలులో గోపాల్‌రెడ్డికి మెజార్టీ వచ్చే అవకాశాలున్నాయి. వైఎస్సార్ జిల్లా నుంచి బలమైన అభ్యర్థులెవరూ బరిలో లేకపోవడం, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కావడంతో ఇక్కడా ఈయనకే లాభించనుంది. అనంతపురం సొంత జిల్లా కాబట్టి ఎలాగూ ఓటర్లు ఈయనవైపే మొగ్గు చూపే అవకాశముంది. పైగా ప్రత్యేకహోదా డిమాండ్ ఎక్కువగా నిరుద్యోగుల్లో ఉంది కాబట్టి ఇది కూడా ఈయనకు మేలు చేయనుంది.
ఉపాధ్యాయ కోటాలో చతుర్ముఖ పోటీ!
ఉపాధ్యాయ కోటాలో సీపీఐ, ఎస్టీయూ మద్దతుతో కత్తి నరసింహారెడ్డి, టీడీపీ, పీఆర్‌టీయూ మద్దతుతో బచ్చల పుల్లయ్య, కర్నూలు నుంచి కేవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి రంగంలో ఉన్నారు. వీరితో పాటు రా్రషో్టపాధ్యాయ సంఘం నుంచి వైఎస్సార్‌జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తున్నారు. ఉపాధ్యాయ కోటాలో వైఎస్సార్‌సీపీ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. ఈ క్రమంలో కత్తి నరసింహారెడ్డి, బచ్చల పుల్లయ్య, కేవీ సుబ్బారెడ్డి, పోచంరెడ్డి సుబ్బారెడ్డి మధ్య చతుర్ముఖపోటీ ఉండొచ్చు. బచ్చల పుల్లయ్య గత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందారు. వైఎస్సార్ జిల్లా వాసి కావడం, గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో ఈయన గెలుపు సులువైంది. ఇప్పుడు ఆ జిల్లాలో కాంగ్రెస్ అత్యంత బలహీనంగా ఉంది. కర్నూలులోనూ ఇదే పరిస్థితి. పైగా ఈయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కత్తి నరసింహారెడ్డి చిత్తూరు జిల్లా వాసి. అక్కడి ఎమ్మెల్సీ స్థానం నుంచి కాకుండా రాయలసీమ పశ్చిమ నుంచి పోటీ చేయడంతో ఈయనపై నాన్ లోకల్ అనే ముద్ర పడింది. కేవీ సుబ్బారెడ్డి, పోచంరెడ్డి సుబ్బారెడ్డి స్వతంత్రంగా బరిలోకి దిగారు. వీరు అధికార పార్టీ నుంచి వచ్చే వ్యతిరేక ఓటు బ్యాంకుపై ఆధారపడ్డారు. ఇది ఎంతవరకూ లాభించనుందనేది తేలాల్సి ఉంది.
Advertisement
Advertisement