
'మోదీవి కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు'
హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని సీపీఐ నేత డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. కార్పొరేట్ శక్తులు, బ్యూరోక్రాట్లు కలిసి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ వైపునకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం మగ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని పోరాడాల్సి ఉందన్నారు.
భారత్‌పై పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. అంతర్జాతీయ సమాజంలో పాక్‌ను ఏకాకిని చేసిన భారత ప్రభుత్వాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిపుత్రులను ఆ భూముల నుంచి వెళ్లగొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.