రేషన్‌షాపుల్లో డబ్బుల పంపిణీ
* బియ్యం ఇవ్వకండా డబ్బులు పంచుతున్న డీలర్లు
* టీడీపీ నేత ఆధ్వర్యంలో బియ్యం రాకెట్
* లబోదిబోమంటున్న పేదలు
పేద, బడుగు, బలహీనులకు ఆహారభద్రత కల్పించేందుకు వారికి కేజీ రూపాయికే అందజేస్తున్న రేషన్ బియ్యం అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు వరమైంది. రేషన్ డీలర్ల రూపంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు షాపుల నుంచే పేదల బియ్యంకు అధికరేటు ఇచ్చి నల్లబజారుకు తరలిస్తున్నారు. కొంతమందికి నెలల తరబడి ఇవ్వకపోగా, మరికొంతమంది బియ్యంకు బదులు కేజీకి రూ.6 నుంచి రూ.7 రేటు కట్టి డబ్బులను పంపిణీచేస్తున్నారు.
నరసరావుపేట(గుంటూరు): జిల్లా మొత్తం 57 మండలాల్లో 2731 షాపులు ఉండగా, .నరసరావుపేట ఎంఎల్‌ఎస్ పాయింట్ పరిధిలో ఐదు మండలాలలకు సంప్రందించి 230 మంది డీలర్లు ఉన్నారు. ప్రతి నెలా 1500 టన్నులు బియ్యం, 49టన్నుల పంచదార పంపిణీ చేయాల్సివుంది. నియోజకవర్గంలో ఎక్కడా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ కావట్లేదు. ఏషాపునకు ఇది రేషన్ షాపు అంటూ బోర్డులు ఉండవు.ప్రతి డీలర్ వద్ద 250 కార్డుల నుంచి 700 కార్డులవరకు ఉన్నాయి. కార్డులను బట్టి ఇద్దరు, ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు షాపులను కేటాయించారు. వారందరూ ప్రతి నెలా తమకు ఇష్టమైతే రేషన్‌షాపు తీస్తున్నారు, నోరు కలిగిన వారికి బియ్యం ఇస్తున్నారు.
అడగలేనివారికి ముందుగానే వేలిముద్రలు సేకరించి రేపు రండి అంటూ స్లిప్‌లు ఇచ్చి ఇక ప్రతిరోజూ రేపు అని షాపుల చుట్టూ తిప్పుతున్నారని లబ్ధిదారులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ సమస్యతో ఐరిస్, వేలిముద్రలు పడడంలేదంటూ పదే పదే షాపుల చుట్టూ తిప్పుతూ లబ్ధిదారులను విసుగెత్తించి వారికి డబ్బులు తీసుకునేలా డీలర్లు ప్రోద్భలం చేస్తున్నారు. పట్టణంలోని వరవకట్టలో ఇద్దరు డీలర్లు రెండు నెలలుగా తమకు రేషన్ ఇవ్వట్లేదంటూ ఆ ప్రాంతానికి చెందిన మహిళలు వినాయకచవితిరోజు మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్‌లను కలిసి మొర పెట్టుకున్నారు. పాతూరు శివాలయం ఎదురు వీధిలోని డీలర్ ఒకరు గత నెల 29వ తేదీ నుంచే తన ద్విచ్రకవాహనంపై ట్రిప్పుకు ఒక బస్తా రేషన్ బియ్యంను నల్లబజారుకు తరలించాడని స్థానికులుతెలియచేస్తున్నారు. టీడీపీ ముఖ్య కార్యకర్త నిర్వహిస్తున్న షాపును పట్టణ శివారులో నిర్వహిస్తూ ప్రతినెలా ఠంచన్‌గా లబ్దిదారులను మాయచేస్తూ సరుకును నల్లబజారుకు తరలిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
పెట్లూరివారిపాలెం కేంద్రంగా నడుస్తున్న రాకెట్..
బియ్యం రాకెట్‌కు మళ్లీ నియోజకవర్గంలో తెరలేచింది. నరసరావుపేట మండలంలోని పెట్లూరివారిపాలెం కేంద్రంగా బియ్యం డంపును నిర్వహిస్తున్నట్లు సమాచారం. గతేడాది ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట శివారు చిలకలూరిపేట జంక్షన్‌లోని ఒక పాడుబడిన గోడౌన్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.30లక్షల విలువైన రేషన్‌బియ్యం బస్తాలను స్వయంగా పట్టించారు. ఇప్పటివరకు నిందితులపై చర్యలేమీలేవు. అప్పటి నుంచి రూట్ మార్చిన నాయకుడు సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు కేంద్రంగా నిర్వహిస్తూ వచ్చాడు. ప్రకాశం జిల్లాకు దగ్గరగా ఉంటుందనే కారణంతో పెట్లూరివారిపాలెం గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని బియ్యాన్ని అక్రమార్కుల నుంచి సేకరిస్తున్నారు. డీలర్ల వద్ద నుంచి బియ్యాన్ని సేకరించి లారీలు, ఆటోల ద్వారా ఇక్కడ నిర్వహించే డంపునకు తరలిస్తున్నారు. ఈ విషయం తెలిసినా పోలీసులు, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.