తెర పడేదెప్పుడో?
-
తీరని పాత నోట్ల మార్పిడి కష్టాలు
-
సెలవు రోజైనా బ్యాంకుల ముందు బారులు
-
ఆదివారం మరింతగా పెరిగిన రద్దీ
-
ఉదయం ఏడు గంటల నుంచే క్యూలు
-
పని ఒత్తిడితో బ్యాంకు సిబ్బంది సతమతం
-
పేదలతో నల్లధనం మార్పించుకుంటున్న పెద్దలు
-
రూ.2 వేల నోటుకు చిల్లర దొరకక ప్రజల అవస్థలు
సాక్షి, రాజమహేంద్రవరం :
కరెన్సీ కష్టాలకు ఇప్పట్లో తెర పడే పరిస్థితి కనిపించడంలేదు. సెలవు రోజైన ఆదివారం కూడా రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు మార్చుకునేందుకు బ్యాంకుల ముందు ఉదయం ఏడు గంటల నుంచే ప్రజలు క్యూలు కట్టారు. గత మూడు రోజులతో పోల్చుకుంటే ఆదివారం రద్దీ పెరిగిందని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. పాత నోట్లు మార్చుకునేందుకు మహిళలు, కూలీలు, మధ్యతరగతి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో తగినన్ని బ్యాంకులు లేకపోవడంతో ప్రజలు పట్టణాల బాట పడుతున్నారు.
తీవ్ర ఒత్తిడికి గురవుతున్న బ్యాంకు సిబ్బంది
ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతున్న బ్యాంకులు రాత్రి 8 గంటల వరకూ సేవలందిస్తున్నాయి. పాత నోట్ల మార్పిడి, జమ చేయడం కోసం వచ్చేవారితో సిబ్బంది క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. రాత్రి 8 తర్వాత లావాదేవీలు నిలిచినా.. తరువాత అంతర్గతంగా జరిగే పనులు రాత్రి 2 వరకూ సాగుతున్నాయి. 4 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతూండడంతో సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
రూ.100 నోట్లకు కొరత
పాతనోట్లు మార్చుకుని రూ.2 వేల నోట్లు తీసుకున్న సంతోషంలో ఉన్న సామాన్యులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. రూ.2 వేల నోటుకు చిల్లర లేకపోవడంతో చేతిలో నగదు ఉన్నా అవసరానికి ఉపయోగపడని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు కూడా తమ ఖాతాదారులకే రూ.2 వేల నోట్లతోపాటు రూ.100 నోట్లు ఇస్తున్నాయి. బ్యాంకులో ఖాతా లేకుండా నగదు మార్చుకునేందుకు వస్తున్నవారికి రూ.2 వేల నోట్లు ఇస్తున్నారు. ఏటీఎంలలో పెడుతున్న రూ.100 నోట్లు రెండు మూడు గంటల్లోనే ఖాళీ అయిపోతోంది. డిమాండుకు తగినట్టుగా రూ.100 నోట్ల సరఫరా లేకపోవడంతో బ్యాంకు అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు.
వ్యాపారం కోసం పెద్ద నోట్ల స్వీకరణ
తాజా పరిస్థితుల్లో వ్యాపారులు పెద్ద నోట్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఈ నోట్లను డిసెంబర్ 31 వరకూ మార్చుకోవచ్చని అవగతమైన తర్వాత కొంతమంది రూ.500 నోట్లు స్వీకరిస్తున్నారు. నాలుగు రోజులుగా వ్యాపారం తగ్గిపోవడంతో గత్యంతరం లేక ఆదివారం మార్కెట్‌లో కొందరు చిరు వ్యాపారులు రూ.500 నోట్లు తీసుకుంటున్నారు.
జోరుగా కమీషన్ల వ్యాపారం
పేదలు, సామాన్యుల ద్వారా నల్లధనం మార్చుకునే ప్రణాళికలు పెద్దలు ఆచరణలో పెడుతున్నారు. అలాగే డ్వాక్రా సంఘాల మహిళలను కూడా పాత నోట్ల మార్పిడికి ఉపయోగిస్తున్నారు. ఒక్కొక్కరు గరిష్టంగా రూ.4 వేలు మార్చుకోవచ్చు. ఇదే అదునుగా నల్ల కుబేరులు వారితో తమ డబ్బు మార్చుకునే పనిలో పడ్డారు. ఇందుకుగాను వారికి 10 శాతం కమీష¯ŒS ఇస్తున్నారు. డ్వాక్రా సంఘాల అధ్యక్షుల సహాయంతో కొందరు రాజకీయ నేతలు పెద్ద మొత్తంలో నల్లధనం మార్చుకుంటున్నట్లు సమాచారం. అందుకే నాలుగు రోజులైనా బ్యాంకుల వద్ద రద్దీ తగ్గకపోగా పెరుగుతోందని అంటున్నారు.