పాన్ కార్డు ప్రయోజనాలెన్నో..
Published Fri, Aug 19 2016 6:15 PM | Last Updated on Thu, Sep 27 2018 4:27 PM
చింతలపూడి: ఆదాయపు పన్ను శాఖ కేటాయించే పర్మినెంట్ అక్కౌంట్ నెంబర్‌ను పాన్ అంటారు. సాధారణంగా ఆదాయపన్ను రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు ఆదాయపన్ను శాఖాధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి పాన్ తప్పనిసరి. పాన్ కార్డు ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. పాన్ కార్డు అవసరం విస్తృతం. ఈనేపథ్యంలో పాన్ కార్డు గురించి వివరాలు తెలుసుకుందాం.
పాన్‌కార్డు ఎప్పుడు అవసరమంటే.. బ్యాంక్‌లో ఖాతా తెరిచేందుకు, చెక్కులు, డీడీలు 50 వేలకు మించితే , స్థిరాస్థి, వాహన కొనుగోలు, అమ్మకాలు సమయంలో.. ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో.. 50 వేలకు పైబడి బ్యాంక్ డిపాజిట్లు చేసినప్పుడు..
–డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు తెలిచేటప్పుడు పాన్ కార్డు అవసరం ఉంటుంది.
పాన్ ఎవరికి అవసరం.. ప్రస్తుతం ఆదాయపన్ను చెల్లించే వారికి, ఇతరుల తరఫున ఆదాయపన్ను రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన వారికి, పాన్ నెంబర్‌ను విధిగా నమోదు చేయాల్సిన లావాదేవీల్లోకి కొత్తగా ప్రవేశించాలనుకునే వారికి ఇది తప్పనిసరి
దరఖాస్తు చేసుకోండిలా.. పాన్ సేవలను మెరుగుపర్చడం కోసం ఆదాయపన్ను శాఖ కార్యాలయం ఉన్న ప్రతి పట్టణంలో ఐటీ పాన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. యుటీఐ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు ఆదాయపన్ను శాఖ అనుమతి ఉంది. ఆ సంస్థ ఆధ్వర్యంలో సర్వీస్ సెంటర్లను నెలకొల్పింది. వీటితో పాటు టిన్ ఫెసిలిటేషన్ కేంద్రాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిలో పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుదారునికి ఇవి తప్పనిసరి.. పాన్ కార్డు దరఖాస్తు చేసుకునేవారు దరఖాస్తుతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫొటో, రూ.107 డిమాండ్ డ్రాప్ట్, వ్యక్తిగత గుర్తింపు, చిరునామా గుర్తింపు పత్రాలు జెరాక్స్‌లు జతచేయాలి.
ఇవి వ్యక్తిగత గుర్తింపు పత్రాలు.. వ్యక్తిగత గుర్తింపు పత్రాలుగా స్కూల్ టీసీ, పదో తరగతి మార్కుల జాబితా , గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి పొందిన డిగ్రీ మార్కుల జాబితా, క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డులలో ఏదో ఒకదాని జెరాక్స్ కాపీ సమర్పించవచ్చు.
ఇవి చిరునామా గుర్తింపు పత్రాలు..చిరునామా గుర్తింపు పత్రాలుగా విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డు, ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్‌మెంట్ ఆర్డర్‌లలో ఏదో ఒకదాని జెరాక్స్ కాపీ జతచేయాలి.
Advertisement
Advertisement