
నగరంలో దోమల రాజ్యం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మళ్లీ డెంగీ, మలేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం 18 రోజుల్లో 20కి పైగా డెంగీ కేసులు నమోదు కాగా, కేవలం ఈ నెల 10నlఒక్క రోజే ఫీవర్ ఆస్పత్రిలో 14 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇప్పటి వరకు 120–150 (డెంగీ, మలేరియా) కేసులు నమోదు కాగా, వీరిలో పది మందికిపైగా మృత్యువాత పడ్డారు. మరో వంద మందికి పైగా మలేరియా జ్వరంతో బాధపడ్డారు. ప్రస్తుతం ఒక్క ఫీవర్ ఆస్పత్రిలోనే 20 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. బస్తీ ప్రజల ప్రాణాలను హరిస్తున్న దోమలను నియంత్రించడంలో గ్రేటర్ పాలకమండలి ఘోరంగా విఫలం అవుతోంది.
ఆ 45 ప్రాంతాల్లో అధికం..
గ్రేటర్ పరిధిలో అధికారికంగా గుర్తించిన మురికివాడలు 1,470 ఉన్నాయి. వీటిలో 8 బస్తీలు ముంపు ప్రాంతాలు. మొత్తం మురికివాడల్లోని 45 ప్రాంతాల్లో దోమల బెడద అత్యధికం. గ్రేటర్ ఎంటమాలజీ విభాగంలో సుమారు 2,375 మంది పనిచేస్తున్నారు. ఈ విభాగం ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. దోమల సాంద్రత గంటకు జియాగూడలో అత్యధికంగా 9.9, బంజారాహిల్స్ ఎర్రగుంట చెరువుతో పాటు, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలో 9.8, జియాగూడలో 9.7, అల్వాల్, మల్కజ్‌గిరిలో 9.5, గోల్నాక, అంబర్‌పేటలో 9.4, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, బార్కాస్‌లో 7.6 దోమలు ఉన్నట్లు గుర్తించారు.
దోమల నియంత్రణ కోసం గ్రేటర్ ఏటా రూ.2.7 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. వర్షాకాలానికి ముందే యాంటీ లార్వా, మలాథియాన్ స్ప్రే, ఫాగింగ్ వంటివి చేయాల్సి ఉన్నా చర్యలు శూన్యం. దోమల వల్ల వచ్చే వ్యాధులపై ఎప్పటికప్పుడు హైరిస్కు బస్తీల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి. ఇంటింటికీ తిరిగి అవగాహన కోసం కరపత్రాలు పంచాలి. కానీ ఎంటమాలజీ విభాగం పట్టించుకోలేదు.
‘ఫీవర్’కు రోగుల తాకిడి..
నల్లకుంట: నగర ప్రజలు రోగాలతో మంచం పడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో పలురకాల సీజనల్ వ్యాధుల దాడి చేస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఫీవర్‌కు 1725 మంది రోగులు వైద్యం కోసం వచ్చారు. వీరిలో అధిక శాతం విష జ్వరాల బాధపడుతున్నవారే కావడం గమనార్హం.