
అదనపు కట్నానికి తల్లీకూతుళ్ల బలి
♦ పసిగుడ్డును చంపి ఆపై ఉరేసుకున్న మహిళ
♦ ధారూరు మండలం కేరెళ్లిలో విషాదం
ధారూరు : అదనపు కట్నానికి తల్లీకూతుళ్లు బలయ్యారు. ఈ సంఘటన మండలంలోని కేరెళ్లి గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. మోమిన్‌పేట్ సీఐ రంగా, ఎస్‌ఐ షంషోద్దీన్ కథం మేరకు.. మండలంలోని రాళ్లచిట్టెంపల్లికి చెందిన బోయిన బాలయ్య కుమారుడు రాజుకు కేరెళ్లి గ్రామానికి చెందిన చింతకింది నాగన్న కుమార్తె లక్ష్మి(24)తో 2008లో వివాహమైంది. ఈ సమయంలో లక్ష్మి తండ్రి నాగన్న కట్నకానుకల కింద రూ. లక్ష నగదు, మూడు తులాల బంగారంతో పాటు బడిబాసడ్లు ఇచ్చి వివాహం చేశాడు. కట్నంలో భాగంగా ఇవ్వాల్సిన మరో రూ. 50 వేల డబ్బు కూడా మరో విడతలో ఇచే ్చశాడు. అయితే ఇటీవల కాలంలో అదనపు కట్నం కోసం భర్త రాజు, బావ శంకరయ్య, అత్త రుక్కమ్మలు లక్ష్మిని వేధింపులు ఎక్కువయ్యాయి.
పుట్టింటికి వెళ్లి మరో రూ. లక్ష తీసుకురావాలని ఆమెపై వత్తిడి తెచ్చారు. అదనపు కట్నం తీసుకరాకపోవడంతో వీరంతా లక్ష్మిని చితకబాది ఇంటి నుంచి గెంటేశారు. ఆ సమయంలో లక్ష్మి.. తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇరువర్గాల పెద్దలు రాజీ కుదుర్చి తిరిగి లక్ష్మిని అత్తారింటికి పంపారు. కొద్ది రోజుల తర్వాత యథావిధిగా వేధింపులు ప్రారంభమయ్యాయి. నిత్యం లక్ష్మిని భర్త కొడుతుండడంతో మానసికంగా క్రుంగిపోయింది. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మి తన పది నెలల కుమార్తె శ్రీజ గొంతునులిమి చంపి ఆ తర్వాత ఇంట్లోని దులానికి తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రికి ఇంటికి వచ్చిన అత్త, భర్తలు తలుపు మూసి ఉండటాన్ని గమనించి తట్టారు.
లోపలి నుంచి గడియ వేసి ఉండడంతో తలుపులు తెరుచుకోలేదు. దీంతో ఇంటిపైన ఉన్న బండలను తొలగించి లోపలికి దిగి చూడగా లక్ష్మి దూలానికి వేలాడుతూ కనిపించింది. వెంటనే దూలం నుంచి లక్ష్మిని దింపి పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. శ్రీజ కూడా చనిపోయి ఉండటాన్ని గమనించిన రాజు.. విషయాన్ని మామ నాగన్నకు సమాచారం అందించాడు. కాగా.. అదనపుకట్నం కోసం తన కుమార్తె, మనుమరాలు శ్రీజను అల్లుడు రాజు, అతడి సోదరుడు శంకరయ్య, వీరి తల్లి రుక్కలు కలిసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని నాగన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి మోమిన్‌పేట్ సీఐ రంగా, ఎస్‌ఐ షంషోద్దీన్‌లు చేరుకుని శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామం లో విషాద చాయలు నెలకొన్నాయి.