జ్వరంతో బాలింత మృతి
-
ఆరు రోజులకే తల్లిని కోల్పోయినlబాలుడు
జన్నారం : తన కుమారుడికి కడుపునిండా పాలిచ్చి, లాలించాల్సిన తల్లి తనువు చాలించింది. బిడ్డకు జన్ననిచ్చిన ఆరు రోజుల్లోనే తను ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ బాలుడికి తల్లి లేకుండా పోయింది. మండలంలోని ఇందన్‌పల్లి పంచాయతీ నాయకపుగూడలో ఈ సంఘటన చోటుచేసుకుంది. భర్త రాజన్న కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మి(24)కి కడెం మండలం ఇస్లాంపూర్‌కు చెందిన రాయ రాజన్నతో గతేడాది వివాహం జరిపించారు. లక్ష్మి పది రోజుల క్రితం డెలీవరీ నిమిత్తం తల్లిదండ్రుల ఊరు అయిన నాయకపుగూడకు చేరుకుంది. ఆరు రోజుల క్రితం నొప్పులు రావడంతో జన్నారం మండల కేంద్రంలోని ప్రై వేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యురాలు సాధారణ కాన్పు చేయగా.. కుమారుడు జన్మించాడు. కాగా.. ఆమె అప్పటికే జ్వరంతో బాధపడుతోంది. రెండో రోజు ఇంటికి చేర్చగా.. జ్వరం తగ్గలేదు. దీంతో వెంటనే మూడు రోజుల క్రితం రక్త పరీక్షలు చేయించారు. రక్తకణాల సంఖ్య తగ్గినట్లు పరీక్షలో వెల్లడైంది. ఖరీదైన వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేకపోవడంతో జ్వరం మాత్రలు వాడారు. పరిస్థితి విషమించి.. సోమవారం రాత్రి చనిపోయింది. కళ్లు తెరిచి ఇంకా లోకం కూడా చూడని ఆ బాలుడిని చూసి ఆ గూడెం వాసులు కన్నీటి పర్యంతమయ్యారు.
15 రోజుల క్రితమే ఒక బాలిక..
ఇదిలా ఉండగా.. 15 రోజుల క్రితం ఇదే గూడానికి చెందిన రోడ్డు భూమిక(13) అనే బాలిక జ్వరంతోనే మృతి చెందింది. ఈ గూడెంలో అనేక మంది జ్వరంతో బాధపడుతున్నారు. మండలంలో 9 ప్రభుత్వ ఆస్పత్రి సబ్ సెంటర్లు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది సరిగా జ్వరాలు అదుపులోకి రావడం లేదు. డబ్బులు లేక.. ఖరీదైన ప్రైవేటు వైద్యం చేయించుకోలేక గిరిపుత్రులు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికైనా మండలంలోని మారుమూల గ్రామాల్లో వైద్యSసిబ్బంది పర్యటించాల్సిన అవసరం ఉంది.