సరస్వతీ క్షమించు..!
Published Wed, Feb 15 2017 1:45 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
* పాఠశాల ఎదుటే బెల్ట్‌షాపు..
* పెట్రేగిపోతున్న అధికార పార్టీ నాయకులు
* గుడి, బడి తేడా లేకుండా బెల్టుషాపులు
* మందుబాబుల ఆగడాలకు బెంబేలెత్తుతున్న విద్యార్థులు
అధికార పార్టీ నాయకులకు కళ్లు నెత్తికెక్కాయి.. అందుకే గుడీ బడీ తేడా లేకుండా మద్యం బెల్టుషాపులు పెట్టేస్తున్నారు. బెల్టు షాపులను పూర్తిగా నిషేధించాం.. అని చెబుతూనే.. మరోవైపు వాటిని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా పాఠశాల ఎదుటే బెల్టుషాపు పెట్టేంతగా బరితెగించారు. చిన్నారుల చదువులకు ఆటంకం కలిగిస్తూ.. ఓ దుర్వ్యసనాన్ని వారి కళ్లకు కడుతున్నారు..
నరసరావుపేట రూరల్ : బెల్ట్ షాపులు రద్దు చేస్తామని ప్రభుత్వం ఒక వైపు చెబుతుంటే మరో వైపు గ్రామాల్లో బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. వాటిని నిర్వహిస్తున్న అ«ధికార పార్టీ నాయకులకు గుడి, బడి అన్న తేడా లేకుండా పోయింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు దుకాణం తెరుస్తున్నారు. లింగంగుంట్లలో జెడ్పీ హైస్కూల్ ఎదుట రెండు రోజుల కిందట బెల్ట్‌షాపు వెలిసింది. వేలాది మంది విద్యార్థులకు దేవాలయంగా భాసిల్లే విద్యాలయం ఎదుట బెల్ట్‌షాపు దర్శనమివ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మండలంలోనే ఆదర్శ పాఠశాలుగా గుర్తింపు పొందిన శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్ ఎదుట ఇటువంటి అసాంఘిక చర్యలకు అధికార పార్టీ నాయకులు వత్తాసు ఇవ్వడం పట్ల ఆరోపణలు వినవస్తున్నాయి. గతంలో ఎన్‌ఎస్‌పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈ బెల్ట్‌షాపును అక్కడి స్థానికులు అభ్యంతరం వ్యక్తంచేయడంతో ఇక్కడకు మార్చారు. ఖాళీ స్థలం చుట్టూ రేకులు ఉంచి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. పాఠశాల సమీపంలో మద్యం అమ్మకాలు చేపట్టడంతో మందుబాబుల వీరంగాలకు విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు.
ట్యూషన్ వేళ.. తాగుడు గోల
నూరు శాతం ఫలితాలు సాధించేందుకు పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక ట్యూషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. దీంతో క్లాస్‌లు పూర్తయ్యాక ఇంటికి వెళ్లే సమయంలో మందుబాబుల హడావుడికి విద్యార్థులు భయపడుతున్నారు.
నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం..
జెడ్పీ స్కూల్ ఎదుట బెల్ట్ షాపు ఏర్పాటు చేసిన విషయం తమ దృష్టికి రాలేదని ఎస్‌ఐ అరుణకుమారి చెప్పారు. బెల్ట్‌షాపు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- అరుణకుమారి, ఎక్సైజ్ ఎస్‌ఐ
Advertisement
Advertisement