అమ్మా.. సలామ్!
52 ఏళ్లుగా కొడుకు సేవలో తల్లి
కంటికి రెప్పలాకాపాడుకుంటున్న మాతృమూర్తి
మహబూబ్ నగర్ : ప్రపంచంలో మాతృమూర్తి ప్రేమ వెలకట్టలేనిది.. భూమికి భారమైనా తన కొడుకు తనకు మాత్రం చంటిపిల్లాడే అంటోంది ఆ తల్లి.. కాళ్లూచేతులు లేని ఆ బిడ్డకు 52 ఏళ్లుగా సేవచేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.. వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల గ్రామానికి చెందిన పెద్ద వెంకట్‌రెడ్డి, ప్రమీలమ్మ దంపతుల రెండో కొడుకు 52ఏళ్ల శివరామిరెడ్డికి పుట్టుకతోనే పోలియోతో కాళ్లు, చేతులు పనిచేయకుండా పోయాయి.
ఐదు దశాబ్దాలుగా మంచంపైనే ఆయనకు తిండితిప్పలు. ఇదిలాఉండగా, మొ దటి కొడుకు అనారోగ్యానికి గురికావడంతో బాగుచేయించేందుకు ఉన్న పొలమంతా అ మ్మి ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఇంతలో ఆ కొడుకు కూడా చనిపోయాడు. కొన్నాళ్ల తరువాత భర్త కూడా చనిపోవడంతో కూలీనాలి ప నులు చేస్తూ గంజోగట్కో తాపించి అవిటివాడై న శివరామిరెడ్డి బాగోగులు చూస్తోంది.. తన కొడుకు టీ తాగుతానంటే చేసిపెడుతుంది. అన్నం తినిపిస్తుంది.
ప్రస్తుతం ఆమె తనతో పాటు కుమారుడికి వచ్చే పింఛన్‌తో పూట గడుపుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రమీలమ్మకు 85 ఏళ్లు.. వయసు మీదపడడంతో ప్రమీలమ్మలో కొడుకు గురించి ఆందోళన మొదలైంది. ఒంట్లో సత్తువ లేకపోవడంతో కూలీ పనులకు పిలిచేవారు లేరని కన్నీరుపెడుతోంది. తాను ఉన్నంత వరకు తన కొడుకును కంటికిరెప్పలా చూసుకుంటానని, తాను వెళ్లిపోతే వాడిని ఎవరు చూసుకుం టారోనని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన కోసం కాకపోయినా కొడుకును పోషించడానికైనా దీర్ఘాయుష్షు ప్రసాదించమని వేడుకుంటోంది ఆ మాతృమూర్తి..!