ఎంపీటీసీ సభ్యురాలి ఆత్మహత్యాయత్నం
గ్రామసభలో అవమానపరిచారని ఆవేదన
గూడూరు: వరంగల్ జిల్లా గూడూరు మండలం బొల్లెపల్లి ఎంపీటీసీ సభ్యురాలు చల్ల నిర్మల శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనకు సంబంధించి ఆమె రాసిన నోట్‌లో వివరాలిలా ఉన్నారుు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈజీఎస్ పనులపై చర్చ జరుగుతుండగా సర్పంచ్ బానోత్ సంధ్య, ఆమె భర్త నాగయ్య ఎంపీటీసీ సభ్యురాలైన నిర్మలను, ఆమె భర్త వెంకటరెడ్డిని అవమానించేలా మాట్లాడారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ కూడా తమను కులం పేరుతో దూషించారంటూ ఎంపీటీసీ దంపతులపై ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ వెంకటేశ్వర్‌రావు గురువారం గ్రామంలో విచారణ నిర్వహించారు. అనంతరం నిర్మల, వెంకటరెడ్డిపై అట్రాసిటీ కేసు న మోదు చేశారు. తాము చెప్పిన విషయూలను సీఐ పట్టించుకోలేదని నిర్మల నోట్‌లో ఆరోపించారు.
రూ. 20 వేలు డిమాండ్..
గురువారం సాయంత్రం ఏఎస్సై భావ్‌సింగ్ వెంకటరెడ్డికి ఫోన్ చేసి సీఐకి రూ. 20 వేలు ఇస్తే కేసు లేకుండా చేస్తారని చెప్పారని, ఈ విషయూన్ని వెంకటరెడ్డి మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన కూడా పట్టించుకోలేదని వాపోయూరు. తన ఆత్మహత్యాయత్నానికి సర్పంచ్, ఆమె భర్తతోపాటు స్థానిక నాయకుడు చల్ల లింగారెడ్డి కారణమని నోట్‌లో పేర్కొన్నారు. నిర్మల ప్రస్తుతం నర్సంపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.