మంత్రిగారి పీఎస్సా మజాకా?
కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు
అధికారుల పనితీరుపై ఆరా
అధికారిక కార్యక్రమాల్లోనూ జోక్యం
గగ్గోలు పెడుతున్న ప్రభుత్వాధికారులు
గుర్ల: ఆయన మంత్రి కాదు... శాఖలకు ఉన్నతాధికారి అస్సలు కాదు.. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో పెత్తనం చెలాయిస్తారు. అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. మంత్రి లేని సమయాల్లో నేరుగా కార్యాలయాల్లోకి వచ్చి తన ప్రతాపం చూపిస్తుంటారు. ఇదీ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని పర్సనల్ సెక్రెటరీ(పీఎస్) రామకృష్ణ హంగామా. మంగళవారం గుర్ల మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. బొంగుహారన్ కలిగిన ప్రభుత్వ వాహనంపై నేరుగా గుర్ల ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ స్త్రీశక్తి భవనంలో జరుగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని తహశీల్దారు పి.ఆదిలక్ష్మితో పలు విషయాలపై చర్చించారు. తొలుత జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ ప్రశాంతి ఎంపీడీఓలు, ఏపీఓలకు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు వద్ద కాసేపు కూర్చుని పరిశీలించారు.
పీహెచ్‌సీలో పరిస్థితులపై ఆరా
గుర్ల పీహెచ్‌సీలోకి ప్రవేశించి ఆస్పత్రిలో ల్యాబ్, మందులిచ్చే గది, సిబ్బంది గదులను పరిశీలించారు. వైద్యాధికారి డాక్టర్ అభిజ్ఞను పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబెట్టారు. ఓపీ ఎంత వస్తోంది.? గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇంత వరకూ ఎన్ని మాతృ, శిశు మరణాలు సంభవించాయి. బాల్యవివాహాల నిరోధానికి ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎమ్‌ల సహాయంతో గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారా..? మందులు సక్రమంగా అందుతున్నాయా...? రోగులకు సక్రమమైన సేవలు అందిస్తున్నారా అంటూ ఆరా తీశారు.
గతంలోనూ ఇలా రెండుసార్లు
గతంలో పీహెచ్‌సీకి వచ్చి తనిఖీ చేశారు. హాజరు పట్టీని తనిఖీ చేసి గ్రీన్‌పెన్‌తో స్వయానా రౌండప్ చేశారు. ఇలా మంత్రి పీఎస్ పదే పదే కార్యాలయాలను తనిఖీ చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈయనే మంత్రిలా స్వయాన గెజిటెడ్ అధికారులను సైతం ప్రశ్నించడంపై అధికార వర్గాల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. పీఎస్ వస్తున్నారు అని తెలియగానే తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంటోందని అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.