
టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తాం
– దళితులపై దాడులు చేస్తే ప్రైవేట్ సైన్యంతో తిరగబడతాం
– మహాసంకల్ప సభలో ఎమ్మార్పీఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు
కళ్యాణదుర్గం: ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా అడుగడుగనా దళితులపై దాడులు చేయడం, ఉద్యమాలకు అణగదొక్కడానికి పూనుకుంటున్న సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీని నామరూపాల్లేకుండా చేస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు హెచ్చరించారు. స్థానిక కృష్ణమందిరంలో శనివారం మహాసంకల్ప సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజు మాట్లాడుతూ దేవినేని ఉమ అనుచరులతో పాటు రాష్ట్రంలో చాలా చోట్ల దళితులపై దాడులు చేస్తున్నారన్నారు. ఇలాగే దాడులు కొనసాగిస్తే ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకుని తిరగబడతామన్నారు. రాష్ట్ర విభజనలో రెండు కళ్ల సిద్దాంతాన్ని అవలంభించిన చంద్రబాబు ఎస్సీ వర్గీకరణలో రెండు నాల్కుల ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు.
కోట్లకు అధిపతులుగా ఉన్న కాపులను బీసీల్లో చేర్చేందుకు చూపుతున్న ప్రేమ, ఎస్సీ వర్గీకరణ పట్ల ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాల్సింది పోయి ఉద్యమాలను అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారని వాపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాలు చేయకుండా చేస్తున్నారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వమన్నారు. దళిత కాలనీలు ఎక్కడా అభివృద్ధికి నోచుకోలేదని, కేవలం ప్రభుత్వ ప్రకటనల్లో మాత్రమే కనిపిస్తుందన్నారు. బుడగ జంగాల పరిస్థితి దౌర్భాగ్యంగా ఉందని, వీరిని ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ కోసం ఈనెల 27న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగే ధర్నాలో దళితుల సత్తాను చాటాలన్నారు. అంతకుముందు జగజ్జీవన్‌రామ్‌కు పూలమాల వేసి ర్యాలీగా వచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గుత్తి ఇన్‌చార్జ్ ప్రసాద్, రాష్ట్ర నాయకులు కుంటిమద్ది ఓబులేశు, వన్నూరప్ప, స్వామిదాస్, చిన్నపెద్దన్న, జిల్లా అధ్యక్షుడు కృష్ణ, స్థానిక నాయకులు నాగరాజు, కుళ్ళాయప్ప, దొణస్వామి, అంజి తదితరులు పాల్గొన్నారు.