మరోసారి కాపుల పోరుబాట
జగ్గంపేట/కిర్లంపూడి : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ‘కాపు సత్యాగ్రహ యాత్ర’ పేరిట మరోసారి పోరుబాట పడుతున్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విస్మరించారని పేర్కొంటూ.. నవంబరు 16 నుంచి కాపు రిజర్వేషన్ల సాధనకు పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటించారు. తూర్పు గోదావరి కిర్లంపూడిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముద్రగడ మాట్లాడారు. ఫిబ్రవరి నెలలో తాను చేపట్టిన ఆమరణ దీక్ష సమయంలో ఏడు నెలల్లో మంజునాథ కమిషన్ నివేదిక విడుదల చేస్తామని, కాపులకు ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని, ఎన్ని దరఖాస్తులు వచ్చినా రుణాలు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు.
వాటిల్లో ఇంతవరకూ ఏ ఒక్కటీ అమలు చేయకుండా కాపుజాతిని ముఖ్యమంత్రి మోసం చేశారన్నారు. ఆగస్టు నెలాఖరు వరకూ చూశాం. రిజర్వేషన్లు సాధించే వరకూ దశలవారీ ఉద్యమం చేపట్టాలని కాపు ప్రముఖులతో కలిసి నిర్ణయించుకున్నాం. 15 రోజులకోసారి రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ పోరాటం చేస్తాం.. అని ముద్రగడ చెప్పారు. ఇందులో భాగంగా రావులపాలెం నుంచి అమలాపురం మీదుగా అంతర్వేది వరకూ ఐదు రోజులపాటు పాదయాత్ర చేపడతామని తెలిపారు. కాపులు రక్తం చిందించినచోటే రావులపాలెం నుంచి ఈ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించామన్నారు.
అప్పట్లో కాపు రిజర్వేషన్ పోరాట సమితి సభలో పాల్గొని రిజర్వేషన్ సాధన కోసం ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశానని ముద్రగడ గుర్తు చేశారు. బ్రిటిషు ప్రభుత్వం రిజర్వేషన్లు తీసేయాలనుకున్నప్పుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లండన్‌లో జరిగిన రౌండు టేబుల్ సమావేశంలో కాపులకు రిజర్వేషన్ కొనసాగించాలని చెప్పారన్నారు. 1956లో కాపు జాతిపై కుట్ర పన్ని రిజర్వేషన్లు తొలగించారన్నారు. తిరిగి 1961లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులకు రిజర్వేషన్లు పునరుద్ధరించారన్నారు. తరువాత 1966లో మళ్లీ రిజర్వేషన్లు తొలగించారన్నారు.
బ్రిటిషు పాలనలో అనుభవించిన రిజర్వేషన్లను పోగొట్టుకున్న ఏకైక జాతి కాపుజాతి అని అన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకూ రిజర్వేషన్లు లేక కాపుజాతి లక్షలాది ఉద్యోగాలు, కోట్లాది ప్రభుత్వ సాయం నష్టపోయిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క రోజులో పల్స్ సర్వే చేస్తే.. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నెలల తరబడి పల్స్ సర్వే చేస్తున్నారన్నారు. కమిషన్ల పేరుతో కాలాయాపన చేసి కాపు జాతిని మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. ఉద్యమం కోసం జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మండల మహిళ, యూత్, డాక్టర్లు, అడ్వకేట్ జేఏసీలను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళతామన్నారు.