ముక్కోటి.. భక్తకోటి
-
రత్నగిరిపై అంగరంగ వైభవంగా వేడుక
-
విష్ణుమూర్తి, లక్షీ్మదేవి అలంకరణలో దర్శనమిచ్చిన సత్యదేవుడు, అమ్మవారు
-
ఉత్తర ద్వార దర్శనం ద్వారా తిలకించి పులకించిన భక్తజనం
-
అలరించిన పుష్పాలంకరణ
ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి పర్వదిన వేడుకలు రత్నగిరిపై ఆదివారం రంగరంగ వైభవంగా జరిగాయి. ప్రత్యేక మండపంలో శేషపాన్పుపై పవళించిన విష్ణుమూర్తిగా సత్యదేవుడు, లక్షీ్మదేవిగా అమ్మవారు దర్శనమిచ్చి భక్తులను కనువిందు చేశారు. పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన వేలాది మంది భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం ద్వారా స్వామి, అమ్మవార్లను దర్శించి తరించారు.
– అన్నవరం
తెల్లవారుజామున ఐదు గంటల నుంచి దర్శనం..
స్వామివారి ప్రధానాలయంలోని ప్రత్యేక మండపంలో స్వర్ణభరిత పుష్పాలంకరణతో శోభిల్లుతున్న మండపంలో విష్ణుమూర్తి అవతారంలో ఉన్న సత్యదేవుడు, లక్షీ్మదేవి అవతారంలో గల సత్యవతీదేవి అమ్మవారికి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు పండితులు ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం చైర్మ¯ŒS ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉత్తర ద్వారం ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించారు. గర్భాలయంలోని సత్యదేవుడు, అమ్మవార్లను తిలకించి దక్షణ ద్వారం ద్వారా ఆలయం వెలుపలకు వచ్చే ఏర్పాటు చేశారు. సుమారు 20 వేల మంది భక్తులు సత్యదేవుడు, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉభయగోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచే కాకుండా తెలంగాణా రాయలసీమ నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు.
కదంబ ప్రసాదం పంపిణీ
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా ఆకుకూరలు అన్నం కలిపి వండిన కదంబం ప్రసాదాన్ని స్వామి, అమ్మవార్లకు నివేదించిన తరువాత భక్తులకు పంపిణీ చేశారు.
ఆకట్టుకున్న పుష్పాలంకరణ
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుని ప్రధానాలయంలో చేసిన అలంకరణ అందరినీ ఆకట్టుకుంది.
చాగల్లు, కత్తిపూడి లకు చెందిన కోలాటం బృందాలు చేసిన కోలాట నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ సంఖ్యలో భక్తులు సత్యదేవుని వ్రతాలాచరించారు.
వెండి రథంపై సత్యదేవుని ఊరేగింపు
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రత్నగిరిపై సత్యదేవుని ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను స్వామివారి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి వెండి రథంపై ఆశీనుల్ని చేసి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి రథం ఊరేగింపు ప్రారంభమైంది. సత్యదేవుని ఆలయం చుట్టూ మూడుసార్లు ఊరేగించారు. దేవస్థానం ఈఓ కే నాగేశ్వరరావు, ఏసీ జగన్నాథరావు, భక్తులు వెండి రథం లాగారు.
55 కల్యాణాలు నిర్వహణ
ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో ఆదివారం సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారు 20 వేల మంది వచ్చినట్టు అంచనా. రికార్డుస్థాయిలో 55 మంది భక్తులు టికెట్లు కొనుగోలు చేసి స్వామివారి నిత్యకల్యాణంలో పాల్గొన్నారు.