ఏప్రిల్‌లో ‘పుర’ సమరం
♦ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట మున్సిపాలిటీకి ఎన్నికలు
♦ వార్డు రిజర్వేషన్లు సిద్ధం.. నేడు ప్రభుత్వానికి ప్రతిపాదనలు
♦ ఆమోదిస్తే వెంటనే ఎన్నికల ప్రకటన
♦ అసెంబ్లీ సమావేశాల తర్వాతే ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కారు
♦ దుబ్బాక, సిద్దిపేట, కొల్లాపూర్, మేడ్చల్ ఎన్నికలకు తొలగని న్యాయ చిక్కులు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన అధికార పార్టీ.. త్వరలో మరో ‘పుర’ సమరానికి సిద్ధమవుతోంది. గ్రేటర్ జోష్‌లో ఉన్న సర్కారు.. త్వరలో గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... వచ్చే ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు పురపాలికలకు ఎన్నికల ప్రక్రియ కసరత్తు పూర్తయింది. డివిజన్లు/వార్డుల రిజర్వేషన్లను సిద్ధం చేసిన పురపాలక శాఖ సోమవారం ప్రభుత్వ ఆమోదం కోసం పంపించనుంది.
ఈ రిజర్వేషన్లను ప్రభుత్వం ఆమోదించిన వెంటనే ఈ మూడు చోట్లలో ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెలలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆ తర్వాతే ఈ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. మార్చి 20 వరకు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. ఆ తర్వాతే డివిజన్లు/వార్డు రిజర్వేషన్లను ప్రభుత్వం ఆమోదించే అవకాశాలున్నాయి. దీంతో పోలింగ్ ఏప్రిల్‌లో జరిగే అవకాశముంది.
ఇంకా తొలగని కోర్టు చిక్కులు..
రాష్ట్రంలోని 3 మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు 53 మున్సిపాలిటీలకు 2014 మార్చి 31న ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఎన్నికలు వాయిదా పడిన సిద్దిపేట, కొల్లాపూర్, మేడ్చల్, దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికలను ఇంకా న్యాయపరమైన చిక్కులు వెంటాడుతున్నాయి. సిద్దిపేట, కొల్లాపూర్ పురపాలికల వార్డు రిజర్వేషన్లను పురపాలక శాఖ సిద్ధం చేసింది. సిద్దిపేట మున్సిపాలిటీలో ఆరు శివారు గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు కేసు వేయడంతో అప్పట్లో హైకోర్టు విధించిన స్టే ఇంకా కొనసాగుతోంది. అలాగే కొల్లాపూర్, మేడ్చల్, దుబ్బాకకు గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీలుగా హోదా కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు వేసిన కేసుపై ఇంకా స్టే ఉంది.
సిద్దిపేట, కొల్లాపూర్ పురపాలికల వార్డు రిజర్వేషన్లు ఇప్పటికే సిద్ధం కావడంతో కోర్టు స్టే తొలగిన వెంటనే ఎన్నికల నిర్వహణ సాధ్యం కానుంది. మార్చి చివరిలోగా న్యాయపరమైన చిక్కులు తొలగిపోతే సిద్దిపేట, కొల్లాపూర్ మున్సిపాలిటీలకు సైతం గ్రేటర్ వరంగల్, ఖమ్మం, అచ్చంపేటతో కలిపే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. హైకోర్టు స్టే తొలగిన తర్వాతే మేడ్చల్, దుబ్బాక పురపాలికల వార్డు రిజర్వేషన్లను ఖరారు చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఇటీవల కొత్తగా ఏర్పడిన బాదెపల్లి(మహబూబ్‌నగర్ జిల్లా) నగర పంచాయతీకి ఎన్నికలు నిర్వహించేందుకు రెండేళ్ల గడువు ఉందని అధికారులు తెలిపారు.