
మానవత్వం కుమిలి కుమిలి ఏడుస్తోంది..
► మంగళవారం అక్కాబావను నరికి చంపిన వైనం
► గతంలో ఇదే తరహా ఘటనలు
► జిల్లాలో తెగిపోతున్న మానవ సంబంధాలు
పేగు బంధం శోకిస్తోంది.. కనిపెంచుకున్న బిడ్డలే కడతేరుస్తున్నారని.. తోబుట్టువు రోదిస్తోంది.. రక్తం పంచుకున్న వాడే నెత్తుటి గాయం చేస్తున్నాడని.. బంధుత్వం బావురమంటోంది.. నా అన్నవాళ్లను నిలువునా చిదిమేస్తున్నారని.. మానవత్వం కుమిలి కుమిలి ఏడుస్తోంది..నా జాడ ఎక్కడో కాస్త చూపించండయ్యా అని.. ఇవన్నీ చూసి పైసా నవ్వుతోంది.. నా పేరాశలో పడితే బంధాలన్నీ రక్తపుటేరులు కావాల్సిందేనని..
సాక్షి, గుంటూరు: బంధాలు, బంధుత్వాలను మరిచిపోతున్నారు. ఆస్తుల కోసం పేగు బంధాన్నే తెంచేస్తున్నారు. డబ్బు కోసం అన్నదమ్ములు కుమ్ములాటకు దిగుతున్నారు. అక్కాతమ్ముళ్లు అనే రక్త సంబంధాన్ని మరిచి గొంతులు కోసుకుంటున్నారు. తల్లిదండ్రులపై సైతం దాడులకు తెగబడుతున్నారు. ధనకాంక్షతో హత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు, బావామరుదులు, భార్యాభర్తలనే సంబంధాలేవీ డబ్బుకంటే ఎక్కువ కాదంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు.
నిండు ప్రాణాలను తృణప్రాయంగా తెంచేస్తున్నారు. ఇలా జిల్లాలో నిత్యం మనీ మాయలో పడి మానవత్వం మాయమైపోతోంది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పట్నం గాలి పల్లెలకూ సోకుతున్నట్లు కనిపిస్తోంది. ఇరుగు పొరుగు వారితోనే సోదరభావంతో కలిసి మెలిసి ఉండే పల్లెల్లో సైతం రూపాయి చిచ్చురేపుతోంది.
జిల్లాలో కొన్ని అమానుష ఘటనలు
జిల్లాలో నెల వ్యవధిలో ఆస్తి వివాదాల నేపథ్యంలో రెండు జంట హత్యలు జరిగాయి. రెంటచింతల మండలం జెట్టిపాలెంలో ఆస్తి కోసం సొంత అన్నా, వదినలను హతమార్చిన దుర్ఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు మేకపోతుల వెంకటేశ్వరరెడ్డి, పిచ్చిరెడ్డిల మధ్య కొంతకాలంగా రెండెకరాల పొలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పొలంలో పనులు చేస్తున్న వెంకటేశ్వరరెడ్డి (53), పద్మావతి (48) దంపతులపై పిచ్చిరెడ్డి, అతని కొడుకులు కత్తులతో దాడి చేసి కిరాతకంగా నరికేశారు.
ఈ దుర్ఘటన మరువక ముందే మంగళవారం రొంపిచర్ల మండలం వీరవట్నంలో ఆస్తి వివాదం నేపథ్యంలో సొంత తమ్ముడే అక్కా బావలను గొంతు కోసి హతమార్చాడు. కొల్లి రమేష్ రెడ్డి (55), సుబ్బమ్మ (50) దంపతులను సుబ్బమ్మ తమ్ముడు సింహాద్రి కృష్ణారెడ్డి కళ్లలో కారం కొట్టి గొంతు కోశాడు. ఈ పాశవిక ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. చిన్నతనం నుంచి కన్న కొడుకులా సాకిన అక్కాబావలనే ఆస్తి కోసం మట్టుబెట్టడంతో గ్రామస్తులు నివ్వెరపోయారు. పదేళ్లుగా వీరి మధ్య ఆస్తి వివాదం నడుస్తున్నట్లు సమాచారం.
గతేడాది తల్లిదండ్రులను మట్టుబెట్టిన కూతురు
చేబ్రోలు మండల కేంద్రంలో గతేడాది ఆస్తి కోసం నవమాసాలు మోసిన కన్న తల్లిని, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రిని భర్తతో కలిసి హత మార్చిందో కసాయి కూతురు. ఈ ఘటనలో వృద్ధ దంపతులు షేక్ ఖాసిం(80), మీరాబీ(75)లు కన్న కూతురు మస్తాన్‌బీ, అల్లుడు ఖాజామొహిద్దీన్ చేతులతో బలయ్యారు. ఈ సంఘటన మనసునూ కదిలించింది.
అవగాహన అవసరం
మాయమవుతున్న మానవత్వాన్ని బతికించేందుకు స్వచ్ఛం సంస్థలు, పోలీసులు సీరియస్‌గా స్పందించి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. రక్త సంబంధాలు, బంధుత్వాలపై చైతన్యం కలిగించాలంటున్నారు. లేదంటే ఈ దారుణాలు నిత్యకృత్యమై రానున్న తరాలనూ నాశనం చేస్తాయి.