మద్యం మత్తులో బావ బావమరిది గొడవ పడ్డారు.
మంచిర్యాల: మద్యం మత్తులో బావ బావమరిది గొడవ పడ్డారు. ఈ ఘటనలో బావ తలపై బావమరిది కర్రతో బాదడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పట్టణంలో జరిగింది. వివరాలు.. ఖమ్మం జిల్లా నాగులంచ గ్రామానికి చెందిన బావ రామ్(25), బావమరిది ప్రభుదాస్ ఇద్దరూ 10 రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో పనికి వెళ్లారు. అయితే, ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి విపరీతంగా మద్యం సేవించారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఒకరినొకరు నీ అంతు చూస్తానంటే నీ అంతూ చూస్తానని బెదిరించుకున్నారు.
అయితే, మద్యం మత్తులో ఉన్న ప్రభుదాస్ ఆవేశంతో బావ రామ్ తలపై కర్రతో గట్టిగా బాదాడు. దీంతో రామ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న కొంతమంది కూలీలు ఇది గమనించి రామ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, తలపై తీవ్రంగా గాయం కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగానే రామ్ మార్గమధ్యలోనే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. బావ మృతి చెందడంతో ప్రభుదాస్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ప్రభుదాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.