ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు ముస్లింల ఝలక్!
⇒అది ఆత్మీయ సమ్మేళనం కాదు.. టీడీపీ రాజకీయ సభ
⇒ఢిల్లీలోని ముస్లిం పెద్దలకు ఫిర్యాదుల పరంపర
⇒విజయవాడ వచ్చే విషయంలో ఢిల్లీ గురువు పునరాలోచన
⇒ముస్లిం తెగల మధ్య చిచ్చుపెట్టే జలీల్ తీరుపై మండిపాటు
విజయవాడ బ్యూరో : ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తీరుపై ముస్లింలు మండిపడుతున్నారు. అవసరార్థం వాడుకుని వదిలేసే జలీల్‌కు ముస్లింలు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 30 ఏళ్ల రాజ కీయ జీవితంలో పార్టీలను, తన జాతిని అవసరార్థం అడ్డంపెట్టుకునే ఆయన నైజంపై గుర్రుగా ఉన్నారు. ముద్రగడ పద్మనాభం పూరించిన కాపు గర్జనను చూసి ముస్లిం గర్జన అంటూ హడావుడి చేసిన జలీల్‌ఖాన్ పచ్చకండువా కప్పుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మంత్రి పదవి, కాకుంటే వక్ఫ్ చైర్మన్ పదవి సాధించుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాన్ని రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నాలు చేస్తుండటంపై ముస్లింలు గుర్రుగా ఉన్నారు. కేవలం తన రాజకీయ పరపతి కోసమే నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని బహిష్కరించి జలీల్‌కు గట్టి ఝలక్ ఇవ్వాలని వారు భావిస్తున్నట్టు సమాచారం.
బలం లేకే గాంధీజీ కళాశాల ఎంపిక...
విజయవాడ వన్‌టౌన్‌లోని గాంధీజీ మహిళా కళాశాల ఆవరణలో ఏప్రిల్ రెండున ఆత్మీయ సమ్మేళనానికి జలీల్ ఏర్పాట్లు చేసుకున్నారు. వాస్తవానికి ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోనే 60 వేల మంది, విజయవాడ నగరంలో సుమారు లక్షా 50 వేల మంది ముస్లింలు ఉన్నట్టు అంచనా. 13 జిల్లాల నుంచి ముస్లింలు తరలివస్తారని జలీల్‌ఖాన్ ప్రచారం చేస్తున్నారు. అదే వాస్తవమైతే బెజవాడ నడిబొడ్డున ఉన్న పీడబ్ల్యూడీ గ్రౌండ్ కూడా సరిపోదు. కానీ కేవలం రెండు నుంచి మూడు వేల మందికి సరి పోయే గాంధీజీ కళాశాలను ఎంచుకున్నారంటే జలీల్‌ఖాన్ బలం ఏమిటో అర్థమవుతోంది. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్‌ను వన్‌టౌన్ మీదుగా మళ్లించారు. అసలే ఇరుకు రోడ్లు ఉండే వన్‌టౌన్‌లో కొద్దిపాటి వాహనాలు వచ్చినా నిత్యం ట్రా ఫిక్ జామ్ అవుతుంది. అలాంట ప్పుడు జలీల్ బలప్రదర్శన సభకు పోలీసులు ఎలా అనుమతించారన్నది వారికే తెలియాలి.
ఢిల్లీ పెద్దకు ఫిర్యాదుల పరంపర...
జలీల్‌ఖాన్ తీరుపై ఢిల్లీలోని ముస్లిం పెద్దలకు ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ముస్లింలలో ఉన్న ఆరు ప్రధాన తెగలను విస్మరించి జమాతే ఉలేమాయే హింద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై మిగిలిన వారికి మింగుడు పడటంలేదు. దీంతో అతి పవిత్రమైన ఆధ్యాత్మిక సదస్సు అని పేరు పెట్టి టీడీపీ రాజకీయ సభగా దీన్ని నిర్వహించడాన్ని వారు తప్పుబడుతున్నారు. టీడీపీలో చేరిన జలీల్‌ఖాన్ తనకు మంత్రి పదవి కోసం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని పెట్టి అందుకు ఢిల్లీలోని మత పెద్దను ఆహ్వానించడాన్ని వారు తప్పుబడుతున్నారు. అయితే అసలు విషయాలను ఇక్కడి ముస్లిం పెద్దలు ఢిల్లీ ముస్లిం పెద్దలకు చేరవేయడంతో మత పెద్ద దృష్టికి వెళ్లింది. ఆధ్యాత్మిక కార్యక్రమం పేరుతో టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అక్కడ ఇస్లాం జెండాలకు బదులు పసుపు పచ్చ జెండాలు పెడుతున్నారని పలువురు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేశారు. దీంతో గత రెండు రోజులుగా జమాతే ఉలేమాయే ప్రతినిధులు విజయవాడ వచ్చి వివరాలు తెలుసుకుని ఢిల్లీ పెద్దకు చెప్పడంతో వారు పునరాలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఆయన రాకుంటే తన పరువు పోతుందని, ఎలాగైనా రప్పించాలని జలీల్‌ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నారు.
మరొకరిని ఎదగనీయకుండా...
జలీల్‌ఖాన్‌ది ఆది నుంచి అవకాశవాదమేనని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో పదవుల కోసం, పట్టు కోసం కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లి, అటు తరువాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చి వైఎస్సార్‌సీపీలో ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన జలీల్ తీరుపై పశ్చిమ నియోజకవర్గ ముస్లిం లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎవరి అండతో ఎదిగితే వారినే తిట్టే నైజం ఆయనది. చివరకు సొంత కులానికి చెందిన వారి ఎదుగుదలను కూడా తట్టుకోలేరనడానికి అనేక సందర్భాలున్నాయి. గతంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లికా బేగం ఓటమికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కారణమయ్యారు. టీడీపీలో చేరిన జలీల్ ఇప్పుడు నాగుల్‌మీరా రాజకీయ ఉన్నతికి అవరోధంగా మారారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పార్టీకి ఎన్నో సేవలు అందించిన ఎమ్మెల్సీ ఎంఏ అన్సారీ (నరసాపురం) మంత్రి పదవికి పోటీ వస్తాడనుకుని ఇప్పుడు ముస్లిం ఆత్మీయ సమ్మేళనంలో ఆయనకు కనీస ప్రాధాన్యత లేకుండా జలీల్ జాగ్రత్త పడుతున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే ముస్లింలకు ఆయన చేసింది ఏమీలేకపోగా అవకాశం వచ్చినప్పుడు వారిని దెబ్బతీసేందుకే ఆయన ఎత్తులు వేయడంతో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.