
వైఎస్ఆర్ సీపీలోకి ముత్తా గోపాలకృష్ణ, కన్నబాబు
కాకినాడ: మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, ఆయన కుమారుడు ముత్తా శశిధర్, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం కాకినాడలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ముత్తా గోపాల కృష్ణ, కన్నబాబు, శశిధర్ మాట్లాడుతూ జగన్ నాయకత్వంలో పార్టీలో అందరితో కలసి పనిచేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు జగన్ నాయకత్వం అవసరమని కన్నబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 18 నెలల పాలనలో ప్రజలకు ఆయనపై భ్రమలు తొలగిపోయాయని విమర్శించారు. గత ఎన్నికల సందర్భంగా రైతు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చినట్టయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారని కన్నబాబు అన్నారు. చంద్రబాబు ఇలాంటి తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. జగన్ విశ్వసనీయత గల నాయకుడని కన్నబాబు చెప్పారు. ముత్తా గోపాలకృష్ణ మాట్లాడుతూ.. జగన్ పోరాటయోధుడని అన్నారు. చంద్రబాబు ప్రజలకు చూపిస్తున్న సినిమా బాహుబలిని మించిపోయిందని విమర్శించారు.