సాక్షి, తూర్పుగోదావరి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. ‘నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పవన్ మాట్లాడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి కావాలనుకోవడంలో తప్పులేనప్పుడు... ఒక జర్నలిస్టు ఎమ్మెల్యే అయితే తప్పా’ అని ప్రశ్నించారు. పవన్ భ్రమల్లో ఉన్నారనీ, తానే మహానాయకున్ని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
చిరంజీవి కోరిక మేరకే తాను రాజకీయాల్లోకి వచ్చానని కన్నా తెలిపారు. పీఆర్పీ ఓటమిపాలైన తర్వాత పార్టీలో కనపడని పవన్ 2014లో సొంతపార్టీ పెట్టుకుని చంద్రబాబుకు మద్దతు పలికారని దుయ్యబట్టారు. చంద్రబాబును మహానుభావుడని ప్రచారం చేసి జనాన్ని మభ్యపెట్టి ఓట్లు వేయించారని మండిపడ్డారు. ఇప్పుడదే బాబును అవినీతి పరుడంటూ పవన్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
వైఎస్ జగన్ ఎక్కడ ఉద్యమాలు చేస్తే పవన్ అక్కడే ఉద్యమాలు చేసేవారని గుర్తు చేశారు. ‘పవన్‌కు మొన్న మార్చిలోనే మెలకువ వచ్చినట్టుంది. అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న టీడీపీపై కాకుండా ప్రతిపక్షపార్టీ నాయకులమీద పసలేని విమర్శలు చేస్తున్నారు. అప్పటివరకూ ఆయన హాలీడేస్ తీసుకున్నట్టున్నారు’ అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతలపై రాళ్లు వేస్తూ.. చంద్రబాబు, లోకేష్‌బాబులను మాత్రం పవన్ పూలతో కొడుతున్నారని చురకలంటించారు.
Comments
Please login to add a commentAdd a comment