
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించి అధికారంలోకి రానుందని ‘ఆరా’ సంస్థ అధిపతి షేక్ మస్తాన్‌వలి ప్రకటించారు. 175 అసెంబ్లీ స్థానాలకుగానూ వైఎస్సార్ సీపీ 119 సీట్లను ఖాయంగా గెల్చుకుంటుందని చెప్పారు. మరో 18 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నువ్వా? నేనా? అన్నట్లుగా గట్టి పోటీలో ఉన్నారని, ప్రత్యర్థుల కన్నా 3 శాతం ఓట్ల ఆధిక్యతతో ఉన్నారని స్పష్టం అవుతోందన్నారు. ఈ స్వల్ప శాతం ఆధిక్యతను అంచనా వేయడం కష్టతరం కనుక కచ్చితంగా చెప్పలేకపోతున్నామని ఫలితాలపై విశ్లేషించారు.
ఆ నియోజకవర్గాల్లో 3 శాతం ఆధిక్యత అలాగే కొనసాగితే వైఎస్సార్ సీపీ గెలుచుకునే అసెంబ్లీ స్థానాల సంఖ్య 135 వరకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర లేదని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎగ్జిట్ పోల్స్ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ 47 సీట్లకు పరిమితమవుతుందని తెలిపారు. జనసేనకు 2 స్థానాలు (ప్లస్ లేదా మైనస్ 1 సీట్లు) రావచ్చన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వెయ్యి శాంపిల్స్ చొప్పున తీసుకుని అభిప్రాయ సేకరణ చేశామని వివరించారు.
లోక్‌సభ స్థానాల విషయానికి వస్తే వైఎస్సార్ సీపీకి 22 ఎంపీ సీట్లు (ప్లస్ లేదా మైనస్ 2 సీట్లు), టీడీపీకి 3 (ప్లస్ లేదా మైనస్ 2) ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొన్నారు. జనసేనకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తాను పోటీ చేసిన భీమవరంలో గెలవరని, గాజువాకలో మాత్రం స్వల్ప ఆధిక్యతలో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని, అక్కడ ఎవరు గెలిచినా 2,000 – 3000 ఓట్ల తేడానే ఉంటుందని, అయితే లోకేష్ ఓటమి చవి చూసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 48.78 శాతం, టీడీపీకి 40.15 శాతం, జనసేనకు 7.81 శాతం ఓట్లు, ఇతరులకు 3.26 శాతం ఓట్లు లభించి ఉంటాయనేది తమ అంచనా అని ఆయన చెప్పారు.