నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి భయం
- పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి విమర్శ
అనంతపురం సెంట్రల్: నంద్యాల ఉప ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతామోనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భయపడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఏనాడు నంద్యాలను పట్టించుకోని ఆయన ఉప ఎన్నికలు సమీపిస్తుండడంతో హామీల వర్షం కురిపిస్తున్నారన్నారు. జాషువ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రం అనంతపురంలోని టవర్‌క్లాక్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అణగారిని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత గుర్రం జాషువాకే దక్కుతుందన్నారు. అయితే నేడు కేంద్ర, రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతుండడం బాధాకరమన్నారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయని చంద్రబాబు నంద్యాలకు 13వేల ఇళ్లు మంజూరు చేస్తానని ప్రకటించారన్నారు. 10వేల పింఛన్లు ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. అంతేకాకుండా మంత్రులు, ఎంపీలు, ఇతర పారిశ్రామికవేత్తలను నంద్యాలలో మకాం వేయిస్తుండటం చూస్తే ఓటమి భయంతోనే అనే విషయం స్పష్టమవుతోందన్నారు. సీఎం స్థాయిలోని వ్యక్తి తాను వేయించిన రోడ్లపై నడుస్తున్నారు.. తానిచ్చిన పింఛన్లు తింటున్నారని వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కోటా çసత్యనారాయణ, పీసీసీ అధికారప్రతినిధి నాగరాజు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.