‘నారాయణ’లో విద్యార్థుల తిరుగుబాటు | narayana college students protest in nellore district | Sakshi
Sakshi News home page

‘నారాయణ’లో విద్యార్థుల తిరుగుబాటు

Published Wed, Mar 16 2016 4:16 PM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

‘నారాయణ’లో విద్యార్థుల తిరుగుబాటు

‘నారాయణ’లో విద్యార్థుల తిరుగుబాటు

ముత్తుకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం, పిడతాపోలూరులోని నారాయణ రెసిడె న్షియల్ జూనియర్ కళాశాలలో సోమవారం అర్ధరాత్రి విద్యార్థులు బీభత్సం సృష్టించారు. కళాశాల నిర్వాహకుల నిర్వాకాన్ని నిరసిస్తూ ఆస్తులు ధ్వంసం చేశారు. వివరాలిలా ఉన్నాయి. కళాశాలలో మొత్తం 1,080 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 500 మందికిపైగా సీనియర్ ఇంటర్ విద్యార్థులున్నారు.

కొంతకాలంగా కళాశాలలో సౌకర్యాల కొరతపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వసూలు చేస్తున్న ఫీజులకు తగ్గట్టు భోజన వసతి లేకపోవడం, స్వగ్రామాల నుంచి వచ్చే తల్లిదండ్రులు, బంధువుల పట్ల ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి వారిని మరింత విసిగించింది. మంగళవారం పరీక్షలు ముగిసే జూనియర్లతో సీనియర్లు కలిశారు. రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. విద్యార్థుల్లో ఆవేశం పెల్లుబికింది.

మూడుసార్లు విద్యుత్ సరఫరా(తొలగించారు)కు అంతరాయం ఏర్పడింది. జనరేటర్ మొరాయించింది. ఈ సమయంలో విద్యార్థులు కళాశాల అడ్మిన్ భవనంలో ఫర్నిచర్, ఏసీ మిషన్లు, ఫ్యాన్లు, గదులపైకప్పు సీలింగ్‌ను ధ్వంసం చేశారు. ప్రాంగణంలో వీధిలైట్లు పగులగొట్టారు. నిర్వాహకుల కారుపై విరుచుకుపడ్డారు. ల్యాబ్‌లో పరికరాలను నాశనం చేశారు. తరగతుల్లోని బెంచ్‌లు, కుర్చీలు, కిటికీ అద్దాలు విరగ్గొట్టారు. వసతిగృహం ఇన్‌చార్జ్ నాగార్జునపై దౌర్జన్యానికి దిగారు.
 
పోలీసుల రంగప్రవేశం
కళాశాల నిర్వాహకుల నుంచి సమాచారం రావడంతో ముత్తుకూరు, కృష్ణపట్నం ఎస్సైలు శ్రీనివాసరెడ్డి, విశ్వనాథరెడ్డి తమ సిబ్బందితో రంగంలోకి దిగారు. పరిస్థితి చక్కబెట్టే ప్రయత్నం చేశారు. కృష్ణపట్నం సీఐ శ్రీనివాసరావు కళాశాలకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ముందు జాగ్రత్తగా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.

జరిగిన బీభత్సం బయటకు పొక్కకుండా మంగళవారం ఉదయం కళాశాల ఉద్యోగులు చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ధ్వంసమైన పరికరాలు, ఫ్యాన్లు, బెంచ్‌లను తొలగించారు. జూనియర్ ఇంటర్ విద్యార్థులను పరీక్ష కోసం నెల్లూరుకు పంపారు. సీనియర్ విద్యార్థులను స్టడీ అవర్స్‌పై కూర్చోబెట్టారు. ఉద్యోగులు మీడియాతో ఎక్కువ మాట్లాడ కుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.
 
కళాశాలలో ఏమీ జరగలేదు: ఏజీఎం
కళాశాలలో ఎటువంటి సంఘటన జరగలేదని ఏజీఎం పద్మారెడ్డి విలేకరులతో అన్నారు. పరీక్షలు పూర్తయ్యే దశలో చిన్న సంఘటనలు జరగడం సహజమన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసుల సాయం కోరామని చెప్పారు. కళాశాల నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement