జాతీయ గీతంపై ద్వంద్వ నీతా?
జాతీయ గీతంపై ద్వంద్వ నీతా?
Published Fri, Dec 25 2015 3:03 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
హైదరాబాద్: ‘ముంబైలోని ఒక థియేటర్‌లో జాతీయ గీతాన్ని వినిపిస్తుండగా లేచి నిలబడి గౌరవించలేదని దేశ ద్రోహులంటూ ఓ ముస్లిం కుటుంబాన్ని బయటికి గెంటేసి గగ్గోలు పెట్టిన ఆర్‌ఎస్‌ఎస్ వాదులు... రష్యా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రూస్ ఎయిర్ పోర్టులో గౌరవ వందనం తర్వాత జాతీయ గీతాన్ని వినిపిస్తుండగా ఆగకుండా ముందుకు వెళ్లడంపై ఏం చెబుతారు? పొరపాటు అనేది మానవ సహజం. ముస్లింలు అనగానే ఉగ్రవాదులు, దేశద్రోహులంటూ వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసం’ అని ఆల్ ఇండియా ఇత్తెహదుల్-ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. బుధవారం రాత్రి దారుస్సలాంలో జరిగిన మిలాద్-ఉన్-నబీ సభలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీకి దేశ ప్రజల బాగోగులు పట్టడం లేదని, కేవలం విదేశీ పర్యటనల్లో మునిగి తేలాడుతున్నారని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లో కరవు విలయ తాండవం చేస్తోందని, బుందేల్‌ఖండ్‌లో ప్రజలు గడ్డి రొట్టెలు తిని జీవిస్తున్నా పట్టని ములాయం సింగ్.. తన 75వ జన్మదినోత్సవాన్ని జరుపుకొనేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
మహారాష్ట్రలో పంటలు ఎండి, తినడానికి తిండి లేక జంతువులున్నా అమ్ముకోవడానికి వీలు లేక ఏడాది కాలంలో సుమారు నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అసద్ ఆవేదన వ్యక్తం చేశారు. గోవధ నిషేధ చట్టం లేకుంటే కనీసం జంతువుల్ని అమ్ముకొని జీవనం గడిపే వారని పేర్కొన్నారు. అయోధ్య నిర్మాణానికి వస్తున్న రాళ్లను సీజ్ చేయకుండా సమాజ్‌వాదీ పార్టీ ప్రేక్షక పాత్ర పోషిస్తోందన్నారు. దీన్ని బట్టి ఆ పార్టీ నిజ స్వరూపం బహిర్గతమవుతుందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చేంతవరకు అయోధ్యలో ఎలాంటి నిర్మాణాలను చేపట్టకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐఎస్‌ఐఎస్‌తో ఇస్లాంకు సంబంధం లేదని, యువత ఉద్వేగాలకు గురికావద్దని కోరారు. ప్రాణాలు తీయడం కాదు.. ప్రాణాలను రక్షించాలని సూచించారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసులు పరిష్కరించండి
ముస్లిం యువత తప్పుడు కేసుల వల్ల తిరగబడుతున్నారని ఇటీవల గుజరాత్‌లో జరిగిన సదస్సులో వ్యాఖ్యానించిన రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మకు చిత్తశుద్ధి ఉంటే చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో మగ్గుతున్న ముస్లిం యువత కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఆర్నెల్లలో పరిష్కరించాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ముస్లింలపై తప్పుడు కేసులు బనాయించడం నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.
నేరస్తులకు కాంగ్రెస్ వత్తాసా..?
తమ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నానికి పాల్పడిన నేరస్తులను కాంగ్రెస్ నేతలు పరామర్శించడాన్ని అసద్ ఎద్దేవా చేశారు. బిహార్, బెంగళూర్‌లలో తమని బయటి వారని పేర్కొన్న కాంగ్రెస్ వాదులు.. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలా రంగంలో దిగుతారని ప్రశ్నించారు. ఈ సభలో మజ్లిస్ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు పాషా ఖాద్రీ, బలాల, జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement