రక్తపాతం లేని చతురంగ బల సమరం చదరంగం.. అరవై నాలుగు గడుల్లో రథ, గజ, తురగ, పదాతి దళాలతో సాగే ఈ రసవత్తర క్రీడా పోరాటం ...
► నేటి నుంచి విశాఖలో జాతీయ రాపిడ్, బ్లిజ్ చెస్ చాంపియన్‌షిప్
► స్వర్ణభారతి స్టేడియంలో 14 వరకు పోటీలు
► పోటీ పడనున్న అతిరథులు
రక్తపాతం లేని చతురంగ బల సమరం చదరంగం.. అరవై నాలుగు గడుల్లో రథ, గజ, తురగ, పదాతి దళాలతో సాగే ఈ రసవత్తర క్రీడా పోరాటం విశ్వవ్యాప్తంగా ఆసక్తికరం. మొదటి ఎత్తు నుంచి, ప్రత్యర్థి రాజుకు చెక్ చెప్పేవరకు ఉత్కంఠభరితంగా సాగే పోటీ, ఇద్దరు సమ ఉజ్జీల మధ్య సాగే మేథోపరమైన పోరాటానికి తార్కాణం. ఎత్తులు, పైఎత్తులతో, ప్రత్యర్థిని ఊపిరి సలపనివ్వని దాడులతో, ఆసక్తికర వ్యూహాలతో క్షణానికో మలుపు తిరుగుతూ సాగే ఈ క్రీడావినోదం ప్రపంచానికి మనదేశం ఇచ్చిన విశిష్ట బహుమానం. తర్వాత ఒక్కో దేశం ఒక్కో అంశాన్ని చేర్చడంతో ఎంతో బలాన్ని, ప్రత్యేకతలను సంతరించుకున్న చదరంగం ఇప్పుడు అంతర్జాతీయంగా ఓ విశిష్ట క్రీడాంశం. అనేక కొత్త పోకడలు పోతున్న చదరంగం ఎందరో యువ ఆటగాళ్లకు, అనుభవజ్ఞులకు ఓ వరం. అన్ని రంగాల్లో వేగం పెరిగిన విధంగానే కాలంతో పోటీ పడుతూ సాగే రాపిడ్, బ్లిజ్, బులెట్ తరహా పోటీలకు నేటి చదరంగం ఆలవాలం. ఈ నేపథ్యంలో విశాఖ వేదికగా జాతీయ ర్యాపిడ్, బ్లిజ్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. - విశాఖపట్నం
భారత్‌లో రూపుదిద్దుకున్న చదరంగం తర్వాత పర్షియాలో కొత్త పుంతలు తొక్కింది. తర్వాత తూర్పు యూరప్ దేశాలు మొదలుకొని అన్ని దేశాల్లో విశేష ప్రాచుర్యం పొందింది. మూడు ఎత్తులు.. ఆరు విజయాలన్న తీరులో అభివృద్ధి చెందుతున్న చదరంగం సంప్రదాయ పద్ధతిలో క్లాసికల్ గేమ్‌గా సాగుతోంది. ఎన్నో దేశాలకు చెందిన యోథానయోథుల వంటి ఆటగాళ్ల వ్యూహ చతురతకు, సంభ్రమాశ్చర్యకర వేగానికి, అసాధారణ ఎత్తుగడలకు అద్దం పడుతోంది. క్లాసికల్ గేమ్‌లో విజేతగా నిలిచిన వారినే చెస్ చాంపియన్‌గా ప్రపంచం గుర్తిస్తుంది. అయితే ఈ పోటీల్లో ప్రతి ఆటగాడికి 120 నిమిషాల కాల వ్యవధి లభిస్తుంది. మన విశ్వనాథన్ ఆనంద్, రష్యా ఆటగాళ్లు కార్పొవ్, కాస్పరోవ్ వంటి హేమాహేమీల ఆట ప్రధానంగా ఈ పద్ధతిలో సాగుతుంది. తర్వాత జరిగిన పర్యవసానాల ఫలితంగా ఇప్పుడు స్పీడ్ చెస్ ఉనికిలోకి వచ్చింది. మాగ్నస్ కార్ల్‌సన్, గ్రిషుక్ ఇప్పటి తరం పోటీల హీరోలుగా గుర్తింపు పొందారు. ప్రపంచ చెస్ సమాఖ్య అయిన ఫిడే ఆటను క్లాసికల్ టైమ్ కంట్రోల్, ఫాస్ట్ చెస్ టైమ్ కంట్రోల్‌గా విడదీసింది.
వేగం.. ప్రధాన సూత్రం
మారుతున్న కాలానికి తగ్గట్టు చదరంగం కూడా వేగాన్ని పుంజుకుంది. క్రికెట్‌లో టెస్ట్ మ్యాచ్‌లకు ప్రాచుర్యం తగ్గి వన్‌డే, టీ20 మ్యాచ్‌లకు ఆదరణ పెరిగినట్టే ఇప్పుడు స్పీడ్ చెస్ ఆదరణ పొందుతోంది. అత్యం త వేగంగా ఎత్తులు వేయడమే ప్రధానంగా సాగే స్పీడ్ చెస్‌లో ఆట తీరును బట్టి రాపిడ్ చెస్, బ్లిడ్జ్ చెస్, బులెట్ చెస్‌గా అనే మూడు భిన్నమైన పంథాలు ఊపిరి పోసుకున్నాయి.
రాపిడ్ చెస్
రాపిడ్ చెస్‌లో కనిష్ట కాల వ్యవ థి పది నిమిషాల నుంచి గరిష్ట కాల వ్యవధి 60 నిమిషాల వరకు ఉంటుంది. మొదటి 40 ఎత్తులు 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆటను 30 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. తొలి ఎత్తు నుంచి టైం ఇంక్రిమెంట్ ఉంటుంది. అంటే ప్రతి ఎత్తుకు 30 సెకెండ్ల అదనపు కాల వ్యవ ధి లభిస్తుంది. ఈ పద్ధతిలో గొప్ప ఎత్తుల కన్నా ఆట వేగానికి గుర్తింపు లభిస్తుంది.
బ్లిజ్ చెస్
ప్రపంచ చెస్ సమాఖ్య నిబంధనల ప్రకారం అతి వేగంగా సాగే బ్లిజ్ చెస్‌లో ప్రతి ఆటగాడికి పదిహేను నిమిషాల వరకు వ్యవధి లభిస్తుంది. క్విక్ అటాక్‌కు పేరుబడిన బ్లిజ్ చెస్‌లో కాల వ్యవధి వృద్ధి (టైమ్ ఇంక్రిమెంట్) కూడా ఉండొచ్చు. అంటే మూడు నిమిషాల వ్యవధికి తోడుగా ఆట ప్రారంభం నుంచి ప్రతి ఎత్తుకు రెండు సెకెండ్ల అదనపు సమయం ఉంటుంది.
బులెట్ చెస్
బ్లిజ్ చెస్‌కు భిన్నంగా మెరుపు వేగంతో సాగే చెస్‌ను బులెట్ చెస్ అంటారు. ఒక్కో ఆటగాడికి ఒకటి నుంచి మూడు నిమిషాల వ్యవధి ఉంటుంది. సాధారణంగా రెండు నిమిషాల ప్రధాన కాల వ్యవధికి తోడు ఒక సెకెండు ఇంక్రిమెంట్ ఉండొచ్చు. లేదా ఒక నిమిషానికి అదనంగా రెండు సెకన్ల ఇంక్రిమెంట్‌తో సాగుతుంది. దీన్నే లైట్నింగ్ గేమ్ అని కూడా అంటారు. ఇది పూర్తిగా ఆన్‌లైన్‌లో ఆడే చెస్‌కు ప్రతీక. చెస్ ఇంజిన్స్‌ను ఏమార్చే అవకాశం లేకుండా చేయడమే ఈ ఆటలో ఉంటుంది. స్పీడ్ చెస్ పోటీలు ప్రధానంగా 2000 సంవత్సరం తర్వాత ఊపందుకున్నాయి. మనదేశం గర్వించదగ్గ విశ్వనాథన్ ఆనంద్ రాపిడ్, బ్లిజ్ తరహా పోటీలు రెండింటిలోనూ గతంలో ప్రపంచ చాంపియన్‌గా నిలవడం విశేషం.
నేటి నుంచి విశాఖలో టోర్నీ
ఎందరో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు పేరుపడ్డ విశాఖ శనివారం నుంచి ప్రతిష్టాత్మకమైన జాతీయ చదరంగం పోటీలకు మరోసారి ఆతిథ్యమిస్తోంది. ఇక్కడి స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో జాతీయ రాపిడ్, బ్లిజ్ చాంపియన్‌షిప్ రేపట్నించి ప్రారంభం కానుంది. రాపిడ్, బ్లిజ్‌ల్లోనూ పదకొండేసి రౌండ్ల పాటు పోటీలు జరగనున్నాయి. రాపిడ్ పోటీలు రేపట్నించి 13 వరకు జరగనుండగా, బ్లిజ్ పోటీలు 14న ఒకరోజే జరగనున్నాయి. గత జాతీయ రాపిడ్, బ్లిజ్ చాంపియన్‌షిప్‌ల్లో ఆయా కాటగిరీల్లో తొలి నాలుగుస్దానాల్లో నిలిచిన వారికి నేరుగా అవకాశం ఉంది. ఇక దేశంలోని 29 రాష్ట్రాలతో పాటు ఆయా క్రీడా బోర్డులకు చెందిన ఆటగాళ్ళు తలపడనున్నారు. విశాఖ చదరంగం ప్రియులకు పండుగ వంటి ఈ పోటీలు జాతీయ క్రీడాపటంలో నగర ప్రాధాన్యాన్ని ఇనుమడించనున్నాయి.
నగదు ప్రోత్సాహకం
రాపిడ్‌లో చెస్‌లో విజేతగా నిలిచిన వారికి రూ. 50 వేల నగదు ప్రోత్సాహకం లభిస్తుంది. రన్నరప్‌కు పాతిక వేలు అందించనున్నారు. మొత్తం బహుమతుల విలువ రూ. 1.75 లక్షలు ఉంటుంది. ఇక బ్లిజ్ విజేతకు ఇరవై వేలు, రన్నరప్‌కు పదివేలు లభిస్తాయి. ఈ పోటీల్లో రూ. 75 వేల మొత్తాన్ని పంచనున్నారు. బెస్ట్ వుమెన్, బెస్ట్ పిహెచ్‌లతో పాటు ఆతిథ్య రాష్ట్ర ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు అండర్ 7 నుంచి 17 వరకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నారు. బ్లిజ్‌లో అండర్ 9 నుంచి పోటీలు నిర్వహిస్తారు.
తలపడే జీఎంలు
ఈ టోర్నీలో ఆడేందుకు ఐదుగురు జీఎంలు, ఏడుగురు ఐఎంలు విశాఖ చేరుకున్నారు. గ్రాండ్ మాస్టర్లు తేజాస్, నీలోత్పల్, లక్ష్మణ్, వేంకటేష్, శ్రీరామ్, ఝా లతో పాటు అంతర్జాతీయ మాస్టర్లు సత్యప్రజ్ఙాన్, తేజ్‌కుమార్, ప్రతీక్, దినేష్, రవిహేగ్డే, రత్నాకర్,మురళీధర్‌లు సత్తాచాటనున్నారు.