జిల్లాలో నయీం భూదందా !
-
నగునూరులో సెటిల్‌మెంట్
-
రూ.4కోట్ల విలువైన రెండు ఎకరాలు కొనుగోలు
-
మాజీ సర్పంచ్ భర్త కీలకపాత్ర
-
నయీమ్ ఇంట్లో దొరికిన పత్రాలతో లోతుగా విచారిస్తున్న పోలీసులు
-
నయీమ్ ఇంట్లో తనిఖీల్లో వెల్లడైన పత్రాలకు సంబంధించిన భూమి ఇదే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలో గ్యాంగ్‌స్టర్ నÄæూమ్, అతడి అనుచరుల భూదందా బాగోతం వెలుగుచూస్తోంది. నయీమ్ ఇంట్లో పోలీసులు చేసిన తనిఖీల్లో కరీంనగర్ మండలం నగునూరు గ్రామానికి చెందిన భూముల వివరాలు బయటపడ్డాయి. మండలానికి చెందిన ఓ మాజీ సర్పంచ్ భర్త నయీమ్ పేరుతో బెదిరింపులకు గురిచేసి పెద్ద ఎత్తున భూములను సెటిల్‌మెంట్ చేస్తూ అతడితో భాగస్వామిగా ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలు ఇలా ఉన్నాయి.
2002లో రమేశ్‌రావు అనే రియల్టర్ నగునూరు గ్రామంలో గూడూరి సదాశివరావుకు చెందిన 23 ఎకరాలను కొనుగోలు చేసి 327 ప్లాట్లుగా చేసి విక్రయించాడు. ఈ వ్యవహారం కోర్టులో నలుగుతున్న క్రమంలోనే 2009లో సాంబశివరావు 23 ఎకరాలను సురేందర్ పేరిట జీపీఏ చేయించాడు. అదే ఏడాది జనవరిలో జిల్లా కోర్టులో ఉన్న కేసును హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయించాడు. జీపీఏ భూములను విక్రయిస్తున్నామని, అభ్యంతరాలుంటే తెలపాలని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ సందర్భంలోనే కరీంనగర్ మండలానికి చెందిన ఓ మాజీ సర్పంచ్ భర్త నయీమ్ అనుచరుడిగా రంగ ప్రవేశం చేశారని పోలీసులు భావిస్తున్నారు. తనతోపాటు మరో నలుగురితో కలిసి జీపీఏ ఆధారంగా ముందుగా ఎకరం విస్తీర్ణంలో ఉన్న దాదాపు 60 ప్లాట్లను కొనుగోలు చేయడంతోపాటు ప్లాట్లను చదును చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ప్లాట్లను గతంలో కొనుగోలు చేసిన వ్యక్తులు వచ్చి అడిగితే నÄæూమ్ పేరుతో బెదిరింపులకు గురిచేశారని, దాదాపు నెలరోజులపాటు ప్లాట్ల వద్దనే ఉంటూ దౌర్జన్యానికి దిగినట్లు తెలిసింది.
నయీమ్ పేరుతో పలుమార్లు ఫోన్లు చేసి బెదిరించినట్లు సమాచారం. అప్పట్లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి సమ్మక్క జాతర పేరిట పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. కోర్టులో కేసు ఉందని, ఈ భూమిని నయీమ్ కొన్నాడంటూ మాజీ సర్పంచ్ భర్త చెబుతూ గతంలో ప్లాట్లు కొన్న ధరకంటే తక్కువ మొత్తంలో డబ్బులిచ్చి సెటిల్‌మెంట్ చేసినట్లు తెలిసింది. ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లలో అత్యధికులు సింగరేణి ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులేనని తేలింది. ఉద్యోగులు తమకు వాళ్లతో గొడవ ఎందుకనే కారణంతో విలువైన ప్లాట్లను తక్కువ ధరకే అమ్మేసి వెళ్లిపోయినట్లు సమాచారం. నయీమ్ ఇంట్లో దొరికిన పత్రాల్లో నగునూరులోని సర్వే నెంబర్ 383 నుంచి 412 వరకు దాదాపు రెండెకరాల మేరకు తన అనుచరుల పేరిట ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీటి విలువ మార్కెట్‌లో రూ. 4కోట్ల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇంకా నయీమ్ అనుచరులెవరున్నారు, ఎక్కడెక్కడ భూ దందాలు, సెటిల్‌మెంట్లు చేశారనే విషయాలపై లోతుగా ఆరా తీస్తున్నారు.