మరో వ్యాపారికి నయీం గ్యాంగ్ బెదిరింపులు
కోరుట్ల : కోరుట్ల బీడీ లీవ్స్ కాంట్రాక్టర్ మహ్మద్ అబ్దుల్ రవూఫ్‌ను బెదిరించి రూ.30 లక్షలు వసూలు చేసిన నయీం గ్యాంగ్ ఆ తరువాత మరో వ్యాపారిని బెదిరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు వ్యాపారికి ఫోన్ ద్వారా హెచ్చరికలు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. సదరు వ్యాపారి మొదట నయీం గ్యాంగ్ బెదిరింపులతో ఇబ్బంది పడ్డప్పటికీ పెద్ద మొత్తంలో డబ్బులు అడగటంతో ఇచ్చేది లేదని మొండికేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే నయీం గ్యాంగ్‌కు కోరుట్లలోని బడా వ్యాపారుల వివరాలు ఎవరు అందించారన్న విషయంపై సిట్ అధికారులు లోతుగా విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. బీడీ లీవ్స్ కాంట్రాక్టర్ రవూఫ్ కదలికలు నయీం గ్యాంగ్ అనుచరులు ఎలా పసిగట్టారన్న విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రవూప్ బంధువులు, పిల్లలు హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్నారు, ఏ స్కూళ్లలో చదువుతున్నారన్న వివరాలు సేకరించి నయీం గ్యాంగ్ బెదిరింపులకు దిగిందంటే ఈ సమాచారాన్ని స్థానికులే అందించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కోరుట్ల, జగిత్యాల ప్రాంతాలకు చెందిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి