బాధితుడు సుంచు నరహరి (నయీమ్ స్వదస్తూరీతో ఇచ్చిన చీటీ)
* కాదంటే నీ ఇద్దరు పిల్లల్నీ ఖతం చేస్తామని నయీమ్ హెచ్చరించాడు
* నయీమ్ అనుచరులు గంటగంటకూ నరకం చూపించారు
* భువనగిరికి చెందిన బాధితుడు నరహరి ఆవేదన
భువనగిరి: ‘‘రెండు కోట్లు ఇస్తావా? లేదా రూ. 50 లక్షలు ఇస్తాను నీ పేరున ఉన్న బంగ్లాను నా పేర రిజిస్టర్ చేస్తావా..? లేదంటే నీ ఇద్దరు పిల్లలను, కుటుంబాన్ని చంపేస్తాను అని నయీమ్ బెదిరించాడు’’ అని గ్యాంగ్‌స్టర్ నయీమ్ బాధితుడు, నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ సానిటరీ షాపు యజమాని సుంచు నరహరి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం నరహరి మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘2015 జూలై 10న నయీమ్ అనుచరులు పాశం శ్రీను, సందెల సుధాకర్.. భాయ్ పిలుస్తున్నాడని చెప్పి నన్ను భువనగిరి నుంచి ఎల్‌బీ నగర్ తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లగానే మరో నల్లటి ఖరీదైన వాహనం సిద్ధంగా ఉంది. నా కళ్లకు గంతలు కట్టి పాశం శ్రీను, మరో ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఆ వాహనంలో బయలుదేరాం. మేము 45 నిమిషాలు ప్రయాణించిన తర్వాత ఓ విశాలమైన భవనంలోకి వెళ్లాం. అక్కడ ఆరుగురు యువతులు ఆయుధాలతో వచ్చి నన్ను చెక్ చేశారు. అనంతరం నయీమ్ వస్తూనే రెండు వేళ్లు చూపించి డబ్బు ఇవ్వమన్నాడు. ‘అంటే రెండు లక్షలా అన్నా అని అడిగితే లక్షలు అనుకున్నావా.. రెండంటే రెండు కోట్లురా నీవు ఇచ్చే రెండు లక్షలతో నా రెండు వేల మంది పిల్లలకు చెడ్డీలు, బనియన్లు కూడా రావు’ అన్నాడు.
రెండు కోట్లు ఇస్తావా లేదా 50 లక్షలు ఇస్తాను నీ పేరున గాంధీ పార్కు ఎదురుగా మెయిన్‌రోడ్డుపై ఉన్న బంగ్లాను నాపేర రిజిస్టర్ చేస్తావా.. లేదంటే కింది పోర్షన్ ఉంచుకుని పైపోర్షన్ నాకిస్తావా? లేదా గద్దర్‌ను, వరవరరావును చంపు, లేదా నక్సలైట్లను చంపడానికి మూడు ఆయుధాలు ఇప్పించు అన్నాడు. ఏదీ కాదంటే నీ ఇద్దరు పిల్లలను, కుటుంబాన్ని చంపేస్తాను అని హెచ్చరించాడు. నేను కాళ్లావేళ్లాపడి అంత ఇచ్చుకోలేనని, నా ఆస్తి అంతా అమ్మినా అంత విలువ చేయదని వేడుకున్నాను. చివరగా రూ.30 లక్షలు ఇవ్వమని కాగితంపై రాసి చూపించాడు. నేను అంత ఇవ్వలేనని బతిమిలాడుకోగా.. చివరకు 30 అంకెను 25గా రెడ్ ఇంక్‌తో మార్చి ఇది ఫైనల్ తీసుకుంటావా? లేదా? నీ ఇష్టం అన్నాడు.
ఈ రోజు నువ్వు నా మనిషివి నిన్ను ఎవరూ ఏమీ అనరు. ఏదైనా సమస్య వస్తే నా సెల్ నంబర్ తీస్కో. లేదంటే పాశం శ్రీనుకు ఫోన్ చెయ్యి అని చెప్పాడు. దీంతో చీటి తీసుకుని వచ్చాను. ఆ రోజు నుంచి పాశం శ్రీను, పులిరాజు మరికొందరు డబ్బులు రెడీ చేశావా లేదా అని గంట గంటకు నా వెంట పడ్డారు. రోజూ ఫోన్ చేయడం, ఇంటికి, దుకాణం వద్దకు ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చి ఏమైంది.. డబ్బులు జమ చేశావా లేదా లేకుంటే నీ కుటుంబాన్ని చంపేస్తాం అని వేధించాడు. అప్పు చేసి గడువు రోజు మధ్యాహ్నానికి రూ.5 లక్షలు జమ చేసి వాయిదా కోరదామనుకున్నా. కానీ పులిరాజు నా దగ్గరకువచ్చి రాత్రి ఎనిమిది గంటల వరకు మొత్తం డబ్బు సమకూర్చకపోతే భాయ్ ఆగ్రహానికి గురికావల్సి వస్తుంది.
నీ కుటుంబం మొత్తం చనిపోతుంది అని హెచ్చరించాడు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో కొందరి కాళ్లు పట్టుకుని 15 మంది వద్ద అప్పులు చేశాను. ఆ సమయంలో నయీమ్ మనుషులు వచ్చి డబ్బులు లెక్క పెట్టుకుని తీసుకుపోయారు’’ అని నరహరి బోరున విలపించాడు. ఈ విషయంలో ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.