జాతరెల్లిపోదామే..జాతరో జాతరా!
జాతరెల్లిపోదామే..జాతరో జాతరా!
Published Tue, Jan 10 2017 10:22 PM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM
మహిమాన్విత్వం.. నీలకంఠేశ్వరుని చరితం..!
- 12నుంచి బ్రహ్మోత్సవాలు
- నెలరోజుల పాటు ఉత్సవాలు
--14న మహారథోత్సవం
- జిల్లాలో ప్రత్యేకం
ఎమ్మిగనూరు : పుణ్యక్షేత్రాలకు నెలవుగా ఉన్న కర్నూలు జిల్లాలో తర్తూరు, ఎమ్మిగనూరు, గూడూరు జాతరలు ప్రధానమైనవి. ఇందులో ఎమ్మిగనూరు జాతరకు దశాబ్ధాల చరిత్ర, ప్రత్యేక స్థానం ఉంది. ఏటా పుష్యమాసం పౌర్ణమి రోజుతో మొదలై మళ్లీ పౌర్ణమి వచ్చేవరకూ అంటె నెల రోజుల పాటు జాతర కొనసాగడం ఇక్కడి ప్రత్యేకత. కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా.. ఎమ్మిగనూరు పరిసరాల వారికి ఇలవేల్పుగా గుర్తింపు పొందిన శ్రీనీలకంఠేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
నాలుగు శతాబ్దాల చరిత్ర
నాలుగు శతాబ్దాలకు పైగా ఎమ్మిగనూరులో శ్రీనీలకంఠేశ్వరస్వామి రథోత్సవం జరుగుతున్నట్లు తెలుస్తోంది. చేనేత మహిళ సేద్యం చేస్తున్నప్పుడు నాగలికి స్వామి వారి లింగం తగలడంతోవెలికితీసి ప్రతిష్టించినట్లు ప్రచారం. చేనేతలు కాశీనుంచీ శివలింగాన్ని తెచ్చి ప్రతిష్టించటంతో పూజలు మొదలైనట్లు మరో ప్రచారం. ఆలయానికి గతంలో ఉన్న భారీ రథం బ్రిటీష్ పాలనలో వివాదం కారణంగా దగ్ధమైనట్లు చెబుతారు. అనంతరం ఈ ప్రాంతంలో సంచరిస్తున్న వనపర్తి రాజులు(సంస్థానాధీసులు) నల్లమొద్దును తెప్పించి దాదాపు 55 ఆడుగుల ఎత్తులో మరో రథాన్ని తయారు చేయించారు. ఈ రథ చక్రాలు పది అడుగుల ఎత్తున్నాయి. రథానికి నాలుగు వైపులా పురాణగాథలను ప్రతిబింబిస్తూ చెక్కిన దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. రథం ఇప్పటి వరకు చెక్కుచెదరకపోవడం విశేషం.
12నుంచి బ్రహ్మోత్సవాలు..
శ్రీ దుర్మిఖినామ సంవత్సరం పుష్యమాస శుక్లపక్ష పౌర్ణమి గురువారం నుంచి సోమవారం వరకు శ్రీ నీలకంఠేశ్వరుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 12వ తేది పుష్పారోహణ సహిత శ్రీపార్వతి పరమేశ్వరస్వామి కల్యాణమహోత్సవం, 13 రాత్రి 9గంటలనుంచి 12గంటల వరకు ప్రభావళి మహోత్సవం, 14 సాయంత్రం 4గంటల నుంచి 6 వరకు మహారథోత్సవం, 15వతేదీ రాత్రి 9నుంచీ 12 వరకూ వ్యాహావళి మహోత్సవం, 16వతేదీ సాయంత్రం 5 నుంచి 9గంటల వరకు తీర్థావళీ వసంతోత్సవం నిర్వహిస్తారు. మహారథోత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు.
వ్యవసాయానికి జాతరే..
ఎమ్మిగనూరు జాతరలో ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి ఉపయోగపడే పలు అంశాలు చోటుచేసుకుంటాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి వివిధ రకాల మేలు జాతి ఎద్దులు, దూడలను విక్రయానికి ఉంచుతారు. పది రోజుల పాటు జరిగే పశువుల జాతరలో రూ.3కోట్ల వరకు లావాదేవీలు నమోదవుతాయి. వివిధ ప్రాంతాల్లో నిపుణులు తయారు చేసిన వ్యవసాయ పనిముట్లు, ఎద్దుల బండ్లను ప్రదర్శన, విక్రయాలకు ఉంచుతారు.
సంప్రదాయ బలప్రదర్శనకు పెద్దపీట..
జాతర సందర్భంగా ఎమ్మిగనూరులో ప్రత్యేకంగా నిర్వహించే ఎద్దుల బలప్రదర్శనలు ఉత్సవాలకు మరింత శోభను తెస్తాయి. నాలుగు రోజుల పోటీల్లో రాష్ట్రం నలుమూల నుంచి వివిధ కేటగిరిలకు చెందిన ఒంగోలు జాతి ఎద్దులను రైతులు ఇక్కడికి తీసుకువస్తారు. నెలల తరబడి తర్ఫీదు ఇచ్చిన మేలు జాతి ఎద్దులతో జరిగే బండలాడుగు పోటీలు ప్రత్యేక ఆకర్శణగా మారాయి.
సాంస్కృతిక కార్యక్రమాలతో అలరింత..
జాతర సందర్భంగా ఎమ్మిగనూరులో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏటా నిర్వహిస్తున్నారు. జానపద నృత్య ప్రదర్శనలు, ఏకపాత్ర అభినయాలు, సంప్రదాయ నాటక ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలతో ఎమ్మిగనూరు కలకలాడునుంది. క్రికెట్, వాలీబాల్, షటీల్, కబడ్ఢీ, ఫుట్‌బాల్ వంటి ప్రధాన టోర్నమెంట్‌లను నిర్వహిస్తున్నారు.
Advertisement