నీళ్లడిగినా నేరమే!
నీళ్లడిగినా నేరమే!
Published Fri, Mar 17 2017 11:52 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
సాగునీరందక చేలు ఎండుతుండటంతో రైతులు రోడ్డెక్కారు. వంతులవారీ విధానంలోనూ నీటిని అందించటంలో ప్రభుత్వం విఫలమైందంటూ నినదించారు. అదే వాళ్లు చేసిన పాపం. నీళ్లడిగిన నేరానికి ఆ అన్నదాతలపై ప్రభుత్వం కేసులు పెట్టించింది. నేడోరేపో అరెస్ట్‌లు తప్పవంటోంది. పెనుగొండ మండలం వడలిలో ఈ అరాచకం చోటుచేసుకుంది.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సాగునీరు అడిగితే చేతులెత్తేసిన ప్రభుత్వం.. ఆదుకోండంటూ రోడ్డెక్కిన రైతులపై కేసులు నమోదు చేసింది. రైతులపై తనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో రుజువు చేసుకుంది. సాగునీటి సమస్య పరిష్కారంపై ఇప్పటికీ దృష్టి పెట్టని సర్కారు రెవెన్యూ సిబ్బందితో ఫిర్యాదు చేయించి తమపై కేసులు నమోదు చేయించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పెనుగొండ మండలం రామన్నపాలెం, వడలి, దేవ, కొఠాలపర్రు, మునపర్రు, వెంకట్రామపురం తదితర గ్రామాల్లోని శివారు భూములకు సాగునీరు అందక వేలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. రెండు వేలకు పైగా ఎకరాల్లో పంట దెబ్బతినే ప్రమాదం ముంచుకురావడంతో ఆ ప్రాంత రైతులు
ఆందోళన చెందుతున్నారు. పెనుగొండ, ఆచంట, యలమంచిలి, పోడూరు మండలాలకు సాగునీరు అందించే బ్రాంచి కెనాల్ ఆధునికీకరణ పనులు సక్రమంగా జరగకపోవడంతో సార్వాలోనూ సాగునీటి సమస్య వచ్చింది. కాకరపర్రు వద్ద కర్రనాచు పెరిగిపోవడంతో దిగువకు నీరు వెళ్లడం లేదు. వంతులవారీ విధానం అమలు చేస్తుండటంతో శివారు భూముల్లో పంట ఎండిపోతోంది. అక్కడి పరిస్థితిని రైతులు జల వనరుల శాఖ అధికారులకు,, నీటి సంఘాల ప్రతి నిధులకు పలుసార్లు తెలియజేశారు. వాళ్లెవరూ స్పందించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఈనెల 14న రోడ్డెక్కారు. ఎండిన వరి దుబ్బులను నెత్తిన పెట్టుకుని వడలి వద్ద ఆందోళనకు దిగి, రెండు గంటలసేపు రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనకు స్పందించి సాగునీరు అందించే ప్రయత్నం చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వారిపై కేసులు పెట్టేందుకు తెగబడింది. వడలి వీఆర్వో డి.మల్లేశ్వరరావుతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. రైతులు రామన్నపాలెం లాకుల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఫిర్యాదు ఆధారంగా పెనుగొండ పోలీసులు ఐపీసీ 341, 147 రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మొదట 20 మందిపై కేసు నమోదు చేసినా తర్వాత ముగ్గురు రైతు నాయకుల పేర్లు పెట్టి, మరికొందరు కౌలు రైతులు అంటూ ఎఫ్‌ఐఆర్ రాశారు.
అధికారులపైనే కేసులు పెట్టాలి
సాగు నీరందక పంటలు ఎండిపోతుంటే కౌలు రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. వారిపై పోలీసులతో కేసులు బనాయించడం దారుణం. ఆ కేసులను వెంటనే ఎత్తివేయాలి. రైతులకు సాగునీరు అందించలేని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై తక్షణం కేసులు నమోదు చేయాలి. కేసులు ఉపసంహరించే వరకూ ఉద్యమిస్తాం.
– కె.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా శాఖ
Advertisement