‘నీరు–చెట్టు’ పనుల తనిఖీ
-
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఈ దివాకర్
పొదలకూరు : మండలంలో నీరు–చెట్టు పథకం కింద ఒకటి, రెండు దశల్లో చేపట్టిన చెరువు పనులను ఇంజనీరింగ్ అధికారులు రికార్డు చేసిన ఎం–బుక్కుల ప్రకారం తనిఖీలు నిర్వహిస్తామని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఈ దివాకర్ పేర్కొన్నారు. మండలంలోని విరువూరు, ఇనుకుర్తి, మర్రిపల్లి తదితర పది చెరువుల పనులను మంగళవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ ఇనుకుర్తి చెరువుకట్ట వద్ద విలేకర్లతో మాట్లాడుతూ మండలంలో 62 చెరువుల పనులకు సంబంధించి కట్టల పటిష్టత, తూముల నిర్మాణం, కాలువల్లో పూడిక తొలగింపు పనులు జరిగాయన్నారు. వీటిలో 55 పనులను ముందుగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. అయితే ఎం–బుక్కులు రికార్డు చేసిన తర్వాత జరిగిన పనులన్నింటిలో పది పనులను తిరిగి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. పొదలకూరు మండలంలో జరిగిన నీరు–చెట్టు పనులపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విజిలెన్స్‌శాఖ ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు తనిఖీలకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఇనుకుర్తి చెరువు కట్ట గండిని పూడ్చేందుకు తొలిదశలో సాంకేతిక మంజూరు కింద రూ.29 లక్షలు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందులో కాంట్రాక్టర్ 36 శాతం లెస్‌కు పనులను దక్కించుకున్నట్లు తెలిపారు. అధికారులు రూ.20 లక్షలకే బిల్లులు చేయాల్సి ఉంటుందని, కాంట్రాక్టర్ రూ.29 లక్షల మేరకు పనులను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. రెండో దశలో మిగిలిన కట్ట పటిష్టతకు వేరుగా నిధులు మంజూరైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు కట్టపై పై లేయర్ నిబంధనల ప్రకారం గ్రావెల్ తోలినది లేనిది పరిశీలించారు. విజిలెన్స్ అధికారుల వెంట ఏఈ బాలకోటయ్య, ఇరిగేషన్ డీఈ హర్సంగ్, ఏఈ కరిముల్లా ఉన్నారు.