కూలి చెల్లింపుల్లో జిల్లాకు మొదటి స్థానం
కూలి చెల్లింపుల్లో జిల్లాకు మొదటి స్థానం
Published Thu, Dec 1 2016 11:48 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(అర్బన్):
పెద్ద నోట్లు రద్దు చేసిన కాలంలో కూడా ఉపాధి కూలీలందరికీ సకాలంలో డబ్బులు చెల్లించడంలో రాష్ట్రంలో నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని డ్వామా పీడీ హరిత తెలిపారు. స్థానిక దర్డామిట్టలోని డ్వామా కార్యాలయంలో గురువారం ఏపీఓలతో సమావేశం జరిగింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. పెద్ద నోట్లు రద్దు చేశాక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఉపాధి కూలీలకు పోస్టల్ శాఖ ద్వారా రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉండగా పోస్టాఫీసులకు చిల్లర నోట్లు రూ.16 కోట్లు పంపించామని తెలిపారు. వెంటనే రూ.7.53 కోట్లను కూలీలకు చెల్లించామన్నారు. మిగతా డబ్బులను రెండు రోజుల్లోనే చెల్లిస్తామని తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద రూ.22.21 కోట్లను చెల్లించగా ఒక్క నెల్లూరులోనే రూ.7.53 కోట్లను చెల్లించడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కలెక్టర్ ముత్యాలరాజు తీసుకున్న ప్రత్యేక చర్యలే కారణమన్నారు. ఇక మీదట నగదు రహిత చెల్లింపులు జరిపేందుకు కూలీలకు శిక్షణ ఇవ్వబోతున్నామని తెలిపారు. అకౌంట్లు లేని వారెవరైనా మిగిలి ఉంటే వారి చేత ఖాతాలు తెరిపిస్తామని చెప్పారు. జాబ్‌కార్డు కలిగి కోరిన ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తామని తెలిపారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో శ్మశానాలు, సీసీరోడ్లు, చెరువుల పనులు , రహదారులు, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. నాడాప్ , వర్మీ కంపోస్టు యూనిట్లను విరివిగా మంజూరు చేస్తున్నామని, పొదుపు మహిళలు వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ఈ యూనిట్ల ద్వారా తయారైన ఎరువును పంట పొలాలకు వినియోగించుకోవాలని, లేదా అమ్ముకుని లాభాలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ పీడీ ప్రభాకర్ పాల్గొన్నారు.
Advertisement