హైదరాబాద్: అభయహస్తం పింఛన్లు, జోగినులకు, వికలాంగులకు, భర్త విడిచిపెట్టిన మహిళలకు పింఛన్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై వివక్ష చూపిస్తోందని టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ అభయహస్తం పింఛన్లు ఏడాది నుంచి మహిళలకు అందడం లేదన్నారు. వికలాంగులకు పింఛన్లు ఇవ్వడంలో సదరన్ క్యాంపుల్లో డాక్టర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు.
సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం అంటూ కొంతమంది కాంట్రాక్టర్లు భారీగా దండుకుంటున్నారని, సన్నబియ్యం పేరిట రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారని శారద ఆరోపించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పటిదాకా ఎక్కడ పూర్తిచేశారో చెప్పాలని సవాల్ చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలతో కలిసి జిల్లా కలెక్టరేట్లను ముట్టడిస్తామని శారద హెచ్చరించారు.